
హైదరాబాద్, వెలుగు: వర్షాలు లేక వ్యవసాయం ముందుకు సాగడం లేదు. రాష్ట్రంలో ఖరీఫ్‌లో కోటి 8 లక్షల 36 వేల217 ఎకరాల్లో పంటలు సాగవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 42 లక్షల 75వేల ఎకరాల్లోనే రైతులు పంటలు వేశారు. ప్రధాన ఆహార పంటైన వరి సాధారణ సాగు 24 లక్షల11 వేల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు లక్షా 46 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. అది కూడా బోర్లు ఉన్న దగ్గర మాత్రమే సాగవుతున్నది. కొన్ని ప్రాంతాల్లో నీళ్లు లేక వరి నారు ఎండిపోతోంది. పత్తి పంట ఈ ఏడాది 50 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే రైతులు ఇప్పటిదాకా 26 లక్షల 63 వేల ఎకరాల్లోనే ఆ పంట వేశారు. పత్తి సాధారణ సాగు 43 లక్షల ఎకరాలు. మక్కల పరిస్థితీ అదేవిధంగా ఉంది. కేవలం 4 లక్షల ఎకరాల్లోనే మక్కలు సాగవుతున్నాయి. సన్‌ఫ్లవర్ 20 ఎకరాల్లో, సజ్జలు 70 ఎకరాల్లో, నువ్వులు 120 ఎకరాల్లో మాత్రమే సాగవుతున్నాయి. పొగాకు అసలు వేయనే వేయలేదని వ్యవసాయశాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గత నెల 21న కురిసిన తొలకరి జల్లులకు రైతులు దుక్కులు దున్ని విత్తులు విత్తుకున్నారు. అటు తర్వాత వాన జాడ లేకుండాపోయింది. ఫలితంగా చాలా చోట్ల విత్తులు భూమిలోనే మాడిపోయాయి. కొన్ని చోట్ల మొలకెత్తినప్పటికీ నీళ్లు లేక ఎండిపోయాయి. బోర్ల పారుకం ఉన్న చోట తప్ప ప్రస్తుతం ఎక్కడా వ్యవసాయం సాగడం లేదు.
- పంట సాధారణ సాగు ఇప్పటివరకు సాగైంది శాతం
- (ఎకరాల్లో) (ఎకరాల్లో)
- వరి 24.11 లక్షలు 1.46 లక్షలు 6
- పత్తి 43.12లక్షలు 26.63 లక్షలు 62
- మక్కలు 12.52లక్షలు 4 లక్షలు 32
- జొన్న 1.16 లక్షలు 53 వేలు 46
- సజ్జలు 4,110 70 2
- కంది 7.29లక్షలు 3.66లక్షలు 50
- పెసర 2.30 లక్షలు 83,782 36
- మినుములు 72,777 30,982 43
- శెనగ 42,912 5,392 13
- నువ్వులు 6,950 120 2
- పొద్దుతిరుగుడు 2,105 20 1
- పొగాకు 3,805 0 0
- మిర్చి 1.84 లక్షలు 1,767 1
- ఉల్లి 13,247 1,030 8
- చెరుకు 85,035 29,315 34
- పసుపు 1.21 లక్షలు 72,637 60