15 నుంచి రూ.50 వేల వరకున్న పంట రుణాల మాఫీ

15 నుంచి రూ.50 వేల వరకున్న పంట రుణాల మాఫీ

హైదరాబాద్: సీఎం క్యాంప్ ఆఫీస్ లో భేటీ అయిన రాష్ట్ర కేబినెట్.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 50 వేల వరకున్న పంట రుణాలు మాఫీ చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15 నుంచి మొదలుపెట్టి నెలాఖరు వరకు.. రుణమాఫీ పూర్తి చేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. దీని ద్వారా 6 లక్షల మంది రైతులకు లబ్ధి జరగనుంది.  EWS రిజర్వేషన్ల అమలుపైనా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ విద్య,ఉద్యోగ అవకాశాల్లో 8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి EWS రిజర్వేషన్ వర్తింపజేయనున్నట్టు కేబినెట్ తెలిపింది. EWS కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిలో  5 సంవత్సరాల సడలింపునివ్వాలని కేబినెట్ నిర్ణయించింది. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలైన పిల్లల పూర్తి వివరాలు తెప్పించాలని వైద్యశాఖ కార్యదర్శిని ఆదేశించింది కేబినెట్. అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి సమగ్ర సమాచారం తెప్పించాలని చెప్పింది.

రాష్ట్రంలోని అనాధలు, అనాధ శరణాలయాల స్థితిగతులు, సమస్యలపై రిపోర్ట్ కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులుగా మంత్రులు కేటీఆర్,  హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఇంద్ర కరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావును నియమించారు. కొత్తగా మంజూరు చేసిన 7 మెడికల్ కాలేజీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అందుకోసం అవసరమైన మౌలిక వసతుల కల్పనపై కేబినెట్ లో చర్చించారు. మెడికల్ కాలేజీల ప్రారంభానికి కావలసిన నిర్మాణాలను చేపట్టాలని, వసతులు వెంటనే ఏర్పాటు చేయాలని రోడ్లు భవనాల శాఖను ఆదేశించింది కేబినెట్.