వడగండ్లతో పలు జిల్లాల్లో పంట నష్టం

వడగండ్లతో పలు జిల్లాల్లో పంట నష్టం
  • దెబ్బతిన్న వరి, మక్క, మామిడి 
  • ఆదుకోవాలని సర్కార్​కు రైతుల వినతి
  •     వేలాది ఎకరాల్లో నేలకొరిగిన వరి, మక్క

వెలుగు, నెట్​వర్క్: శనివారం సాయంత్రం నుంచి ఆదివారం తెల్లవారుజాము దాకా  కురిసిన వడగండ్ల వానకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంట నష్టం వాటిల్లింది.  ప్రధానంగా కామారెడ్డి జిల్లాలో తీవ్ర నష్టం  జరిగింది.  మొత్తం 20,071 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాల్లో వరి, మక్క నేల కొరిగింది. మామిడికాయలు రాలిపోయాయి. పలు చోట్ల కరెంట్​స్తంభాలు పడిపోయి వైర్లు తెగిపడ్డాయి. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, భిక్కనూరు, రాజంపేట, రామారెడ్డి, దోమకొండ, తాడ్వాయి, సదాశివ్​నగర్​, బిచ్కుంద మండలాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉన్నది.

 నిజామాబాద్​జిల్లాలోనూ 6,058 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఈదురుగాలులు, వడగండ్లు పడటంతో వరి గింజలు రాలిపోయాయి. ముఖ్యంగా నిజామాబాద్​ రూరల్ నియోజకవర్గంలోనే 4,775 ఎకరాల పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా తేల్చారు.శనివారం రాత్రి రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.

సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని చిప్పలపల్లి గ్రామంలో వడగండ్లు బీభత్సం సృష్టించాయి.  వీర్నపల్లి మండలంలోని వన్​పల్లి, గర్జనపల్లి, అడవిపదిర, రంగంపేట గ్రామంలో రాళ్లవానతో వడ్లు నేలరాలాయి.  మెట్ పల్లి పట్టణంలో శనివారం సాయంత్రం కురిసిన  అకాల వర్షానికి మార్కెట్ యార్డులో అమ్మకానికి తీసుకొచ్చిన  సుమారు 500 క్వింటాళ్ల పసుపు తడిసింది. పంటనష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.