పది లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది: షర్మిల

పది లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది: షర్మిల
  • ఎకరాకు రూ.20 వేల  పరిహారం ఇయ్యాలె
  • పది లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది: షర్మిల
  • విత్తనాలు, ఎరువులపై సబ్సిడీ ఎందుకియ్యడం లేదు?
  • సీఎం వెళ్లని సెక్రటేరియెట్​కు 1600 కోట్లు ఖర్చుపెట్టారని ఫైర్

హైదరాబాద్, వెలుగు : రాష్ర్టంలో గత రెండు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు పది లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వైఎస్ ఆర్టీపీ చీఫ్  షర్మిల అన్నారు. ప్రతి ఎకరాకు రైతులకు రూ.20 వేల చొప్పున పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్  చేశారు. మంగళవారం లోటస్ పాండ్ లో మీడియాతో ఆమె మాట్లాడారు. మహబూబాబాద్, ఖమ్మం, జనగాంలో మూడు రోజులపాటు పంటనష్టంపై వివరాల కోసం పర్యటించానని, పంటపై రాబడి.. అప్పులు తీర్చడానికి కూడా సరిపోవని రైతులు చెప్పుకొని బాధపడుతున్నారని ఆమె తెలిపారు. ‘‘రైతులకు ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కిసాన్ సర్కార్  అంటూ డబ్బాలు కొట్టుకంటున్న కేసీఆర్.. రాష్ట్రంలో రైతులకు ఏం సమాధానం చెప్తారు? రైతుల దగ్గరికి ఒక్క అధికారి కానీ, ఎమ్మెల్యే కానీ పోయింది లేదు.

పంట నష్టం ఇస్తారనే భరోసా తమకు లేదని రైతులు వాపోతున్నారు. మార్చిలో జరిగిన పంట నష్టంపై అధికారులు సరైన వివరాలు తీసుకోలేదని రైతులు చెబుతున్నారు. ఐదెకరాల్లో పంట నష్టం జరిగితే ఒక ఎకరం రాసుకున్నారు” అని షర్మిల పేర్కొన్నారు. గతంలో మాదిరి రైతులకు ఇన్ పుట్, విత్తనాలు, ఎరువుల మీద సబ్సిడీ ఇవ్వడం లేదని ఆమె ఫైరయ్యారు. దిక్కుమాలిన కేసీఆర్  పాలనలో పంట బీమా కూడా అమలు చేయడం లేదన్నారు. రైతులు  తొమ్మిదేండ్లలో 14 వేల కోట్ల రూపాయలు నష్టపోతే, కేసీఆర్ ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అని షర్మిల  ప్రశ్నించారు. తాను వెళ్లని సెక్రటేరియెట్ కు మాత్రం సీఎం రూ.1600 కోట్లు ఖర్చు చేశారని ఆమె మండిపడ్డారు.  కేసీఆర్​కు దెబ్బతిన్న పంటను  గిఫ్ట్​గా పంపే యత్నం రైతులు నష్టపోయిన పంటను ట్రాలీ ఆటోలో  సీఎం కేసీఆర్ కు బహుమతిగా పంపడానికి షర్మిల చేసిన యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ‘కేసీఆర్ కు గిఫ్ట్’ అని ట్రాలీని సెక్రటేరియెట్ కు పంపే ప్రయత్నం చేయగా పర్మిషన్ లేదని పోలీసులు ట్రాలీని అడ్డుకున్నారు.