- 1.10 కోట్ల క్యాష్.. 2.1 కిలోల బంగారం, 9.2 కిలోల వెండి సీజ్
- 4 కార్లు, పలు జిల్లాల్లో 15 ఎకరాల భూములు
- రూ. 60 కోట్లకుపైగా ఆస్తులు గుర్తించిన ఏసీబీ
- జీఎం లక్ష్మీకుమార్ నివాసంతోపాటు 8 ప్రాంతాల్లో సోదాలు
- కృష్ణా, గోదావరి వాటర్ పైప్‌లైన్ ప్రాజెక్టులో విధులు
- తీవ్ర అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు
- నిందితుడి అరెస్ట్.. నేడూ సోదాలు కొనసాగే చాన్స్
హైదరాబాద్, వెలుగు:జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీ కుమార్ ఇంట్లో కోట్లకొద్దీ నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం బయటపడ్డాయి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున ఆయన ఇంటితో పాటు ఆఫీస్, బంధువులు, స్నేహితులు, బినామీ ఇండ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా, కండ్లు చెదిరే ఆస్తులు వెలుగుచూశాయి. నాంపల్లి రెడ్‌హిల్స్ వాటర్ బోర్డ్ జనరల్ మేనేజర్‌గా ఉన్న ఆయన.. గోదావరి ఫస్ట్ ఫేజ్, కృష్ణా వాటర్ పైప్‌లైన్ ప్రాజెక్టులో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఆయన అవినీతి, అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వివిధ ప్రాంతాల్లో ఏకకాలలో సోదాలు చేపట్టారు. లక్ష్మీకుమార్ కు సుమారు రూ.60 కోట్ల విలువైన స్తిర, చరాస్తులు ఉన్నట్టు గుర్తించడంతో ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. సోదాల్లో దొరికిన రూ.1.10 కోట్ల క్యాష్, 2.1 కిలోల బంగారం, 9.2 కిలోల వెండి వస్తువులను సీజ్ చేశారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన అనంత లక్ష్మీ కుమార్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ బోర్డులో1990లో ఉద్యోగంలో చేరారు. ఇక్కడే అంచెలంచెలుగా ఎదిగి నాంపల్లి రెడ్‌హిల్స్ వాటర్ సప్లయ్ బోర్డుకు జనరల్ మేనేజర్ అయ్యారు. ప్రస్తుతం సిటీ వాటర్ సప్లయ్‌కి సంబంధించిన ప్రాజెక్ట్ విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గోదావరి ఫస్ట్ ఫేజ్, కృష్ణా వాటర్ పైప్‌లైన్ ప్రాజెక్ట్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా కొనసాగుతున్నారు. ఈ మధ్యే రూ. కోట్లు ఖర్చు పెట్టి కూతురి పెండ్లి ఘనంగా చేశారు. దీంతో ఆయనపై ఫిర్యాదులు రాగా, ఏసీబీ కేసు నమోదు చేసింది.
కోటికిపైగా నగదు.. రెండు కిలోల బంగారం
ఏసీబీ అధికారులు మంగళవారం తెల్లవారుజామున తొమ్మిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మల్లాపూర్‌లోని -అనంత లక్ష్మీకుమార్ ఇంటితో పాటు రెడ్‌హిల్స్‌లోని వాటర్ బోర్డ్ ఆఫీస్, బంధువులు, స్నేహితులు, బినామీల ఇండ్లల్లో తనిఖీలు చేపట్టారు. లక్ష్మీకుమార్ ఇంట్లో రూ.1.10 కోట్ల నగదు, 2.1 కిలోల బంగారం, 9.2 కిలోల సిల్వర్ ఆర్టికల్స్ స్వాధీనం చేసుకున్నారు. క్యాష్ కౌంటింగ్ మెషీన్తెప్పించి మరీ నగదును లెక్కించాల్సి వచ్చింది. ఆయనకు సంబంధించిన రెండు కార్లను కూడా సీజ్ చేశారు.
వీటితో పాటు నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 18 ఎకరాల వ్యవసాయ భూములకు చెందిన డాక్యుమెంట్లు, హైదరాబాద్‌లో ఆరు ఓపెన్ ప్లాట్స్, మూడు ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌస్‌కు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు బ్యాంక్ లాకర్లను గుర్తించారు. లాకర్లలో తనిఖీలు చేసి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆస్తుల విలువ అధికారిక లెక్కల ప్రకారం రూ.5.88 కోట్లు ఉండగా.. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం10 రెట్లు ఎక్కువగా అంటే.. దాదాపు రూ.60 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. లక్ష్మీకుమార్ ను అరెస్ట్ చేసి, ఏసీబీ స్పెషల్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. బుధవారం కూడా సోదాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
