చౌటుప్పల్, నారాయణపురం మండలాల్లో క్రాస్​ఓటింగ్?

చౌటుప్పల్, నారాయణపురం మండలాల్లో క్రాస్​ఓటింగ్?

యాదాద్రి, వెలుగు: మునుగోడు పోలింగ్ సందర్భంగా ఓటర్లు గందరగోళానికి గురయ్యారు. కొన్ని చోట్ల క్రాస్​ఓటింగ్​జరగ్గా, ఈవీఎంల విషయంలో కొందరు ఓటర్లు తికమకపడ్డారు. టీఆర్ఎస్​ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డిపై అసంతృప్తిగా ఉన్న కొందరు పార్టీ కార్యకర్తలతో పాటు కమ్యూనిస్టు పార్టీలకు చెందిన వారు క్రాస్​ ఓటింగ్​కు పాల్పడారు. అయితే వీరు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డికి బదులుగా కాంగ్రెస్​ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి ఓటేశారు. కొందరు ఎస్టీ ఓటర్లతో పాటు మహిళలు కూడా కాంగ్రెస్​కు ఓటేశారు. సంస్థాన్ ​నారాయణపురం మండలానికి చెందిన బీఎస్పీ అభ్యర్థి శంకరాచారికి ఆ మండలంలో ఎక్కువగా ఓట్లు పోలైనట్టు తెలుస్తోంది. ఆయన సొంత గ్రామం జనగామలో  భారీగా ఓట్లు  చీలే అవకాశాలున్నాయి. గతంలో టీఆర్‌‌ఎస్ లో ముఖ్య కార్యకర్తగా పని చేసి మునుగోడు టికెట్ ఆశించి భంగ పడ్డ శంకరాచారి బీఎస్పీలో చేరడంతో స్థానికులు ఆయనకు భారీగా ఓట్లు వేసినట్టు సమాచారం.  

ఒకరికి వెయ్యబోయి మరొకరికి...

ప్రచార టైంలో ఆయా పార్టీల లీడర్లు మోడల్​ఈవీఎంలను చూపిస్తూ టీఆర్ఎస్​ రెండో నెంబర్​ అని చెప్పగా, బీజేపీ వాళ్లు మూడో నెంబరని చెప్పారు. ఎన్నికలో 47 మంది బరిలో నిలవగా నోటాతో కలిపి ఒక్కో ఈవీఎంలో 16 మంది పేర్లు పెట్టారు. దీంతో మూడు ఈవీఎంలను ఏర్పాటు చేశారు. దీంతో ఓటు వేయడానికి వచ్చిన కొందరు గందరగోళానికి గురయ్యారు. టీఆర్ఎస్​కు ఓటు వేయాల్సిన వాళ్లు.. రెండో ఈవీఎంలోని రెండో నంబర్​కు, బీజేపీకి ఓటు వేయాల్సిన వాళ్లు మూడో ఈవీఎంలోని మూడో నెంబర్​కు ఓటేశారు. చదువుకున్న వారు కూడా గందరగోళానికి గురై అనుకున్న వాళ్లకు కాకుండా వేరే వాళ్లకు వేశామని చెప్పారు.    

ఆఫీసర్​తో ఫోన్లో మాట్లాడిన మంత్రి

చౌటుప్పల్​ మండలం ఆరెగూడెం పోలింగ్​సెంటర్​లో ఈవీఎంల ఏర్పాటు విషయంలో సర్పంచ్​ మునగాల ప్రభాకర్​రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సెంటర్​కు వచ్చిన ఆయన నేరుగా మంత్రి మల్లారెడ్డికి ఫోన్​ చేశారు. ఓటర్లను చుట్టూ తిప్పిపంపుతున్నారని, దీనివల్ల ఫస్ట్​ఈవీఎంలోని వారికి కాకుండా మూడో ఈవీఎంలోని అభ్యర్థులకు ఓట్లు పడుతున్నాయని చెప్పారు. పోలింగ్ బూత్​లో డ్యూటీ చేస్తున్న అధికారిని బయటకి రప్పించి మంత్రి తో మాట్లాడించారు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు సర్పంచ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 85 ఏండ్లు నిండిన వృద్ధులను టీఆర్ఎస్ కు ఓట్లు వేయించాలని ఆ అధికారికి సూచించారని స్థానికులు ఆరోపించారు. విషయం తెలుకున్న బీజేపీ కార్యకర్తలు పోలింగ్​సెంటర్​కు వచ్చి గొడవ పడ్డారు.