తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 20 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 73 వేల 420 మంది భక్తులు దర్శించుకున్నారు. 27 వేల 627 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 4 కోట్ల 28 లక్షలు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.  మరోవైపు మూడు రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు చేయనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఈ నెల 24, 25 తేదీలతో పాటు నవంబర్ 8న బ్రేక్ దర్శనాలు రద్దు కానున్నాయి. 24 దీపావళి ఆస్థానం కాగా అక్టోబర్ 25న సూర్యగ్రహణం ఉండటంతో బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు టీటీడీ అధికారులు. అలాగే నవంబర్ 8వ తేదీన చంద్రగ్రహణం కావడంతో బ్రేక్ దర్శనాలు రద్దు కానున్నట్లు తెలిపారు. 

సూర్యగ్రహణం రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు ఆలయాన్ని క్లోజ్ చేయనున్నారు. చంద్రగ్రహణం రోజు కూడా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు ఆలయాన్ని క్లోజ్ చేయనున్నారు. ఈ రెండు రోజుల్లో  300 రూపాయిల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కూడా రద్దు చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.