- సౌత్‌పార్స్ గ్యాస్ ఫీల్డ్పై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారం
- ఖతార్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద రాస్ లఫాన్ ఎల్‌ఎన్‌జీ ప్లాంట్‌పై అటాక్
- భారీ స్థాయిలో దెబ్బతిన్న ప్లాంట్.. ఖతార్ ఆర్థికవ్యవస్థకు ఇదే పునాది
- యూఏఈలోని అత్యంత కీలకమైన బాబ్ ఆయిల్ ఫీల్డ్, హబ్షాన్ గ్యాస్ ఫెసిలిటీపై దాడులు
- సౌదీ అరేబియాలోని సామ్రెఫ్, కువైట్‌లోని రెండు రిఫైనరీలపైనా బాంబుల వర్షం
- తమ ఇంధన కేంద్రాలపై దాడి జరిగితే అస్సలు తగ్గబోమని వార్నింగ్
- ముప్పులో ప్రపంచ ఇంధన వనరులు
- అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 118 డాలర్లకు చేరిక..
- యుద్ధం మొదలైన నాటి నుంచి చమురు ధరలు 60 శాతానికి పైగా హైక్..
టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం భయానక స్థాయికి చేరుకున్నది. ఇజ్రాయెల్ తన ప్రధాన సహజ వాయువు క్షేత్రం సౌత్ పార్స్‌పై దాడి చేయడంతో గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ ఫీల్డ్స్ లక్ష్యంగా ఇరాన్ విరుచుకుపడింది. గురువారం తెల్లవారుజామున అరబ్ దేశాల ఇంధన కేంద్రాలపై భారీ దాడులకు దిగింది. ఖతార్‌లోని ప్రపంచంలోనే అతి పెద్ద రాస్ లఫాన్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్‌జీ) ప్లాంట్ పై క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో అక్కడ భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.
ఖతార్ ఆర్థికవ్యవస్థకు జీవనాడి అయిన ఈ ప్లాంట్‌లో ఇప్పటికే ఉత్పత్తి నిలిచిపోగా.. తాజా దాడుల వల్ల కోలుకోలేనంత నష్టం వాటిల్లింది. సౌదీ అరేబియా, కువైట్, అబుదాబిల్లోని ఆయిల్రిఫైనరీలపైనా ఇరాన్ అటాక్ చేసింది. ఈ పరిణామాలతో ప్రపంచ ఇంధన వనరులు ముప్పులో పడ్డాయి. -అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 118 డాలర్లకు చేరింది. యుద్ధం మొదలైన ఈ కొద్ది రోజుల్లోనే చమురు ధరలు 60 శాతానికి పైగా పెరిగాయి.
అగ్ని కీలల్లో ఖతార్ చమురు జీవనాడి..
ఇరాన్ నుంచి గురువారం తెల్లవారుజామున దూసుకొచ్చిన అత్యాధునిక క్షిపణులు ఖతార్‌లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీని లక్ష్యంగా చేసుకున్నాయి. ఇరాన్ ప్రయోగించిన మల్టీ మిసైల్స్ నేరుగా ఎల్‌ఎన్‌జీ నిల్వ ట్యాంకులు, ప్రాసెసింగ్ యూనిట్లను తాకాయి. దీంతో ఆ ప్రాంతం అంతా అగ్నిగుండంగా మారింది.
ఇప్పటికే జరిగిన దాడుల కారణంగా అక్కడ ఉత్పత్తి పాక్షికంగా నిలిచిపోయింది. అయితే, తాజా దాడుల వల్ల ప్లాంట్‌లోని కీలకమైన మౌలిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో అత్యవసర బృందాలను రంగంలోకి దింపి మంటలను అదుపు చేసేందుకు ఖతార్ ప్రభుత్వం యత్నాలు మొదలుపెట్టింది.
ప్రస్తుతానికి ఖతార్ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, ఆ ప్రాంతంలో మళ్లీ ఎప్పుడు క్షిపణులు పడతాయోనన్న భయం గల్ఫ్ దేశాలను వణికిస్తున్నది. ఒకవేళ యుద్ధం తక్షణమే ముగిసినా, రాస్ లఫాన్ ప్లాంట్ మళ్లీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి సుదీర్ఘ కాలం పట్టేలా ఉంది.
ఈ నష్టం అంచనాలకు మించి ఉందని, ప్లాంట్‌ను తిరిగి పునరుద్ధరించడానికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఖతార్ ఎనర్జీ వెల్లడించింది. కాగా, ప్లాంట్‌తో పాటు ఖతార్ తీరంలో లంగరు వేసి ఉన్న ఒక భారీ గ్యాస్ రవాణా నౌకపై కూడా క్షిపణి అవశేషాలు పడటంతో అది పాక్షికంగా దెబ్బతిన్నది.
గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలపై దాడులు..
ఖతార్‌తోపాటు గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలపై ఇరాన్ విరుచుకుపడింది. రెడ్ సీలోని యాన్‌బు పోర్ట్ సమీపంలో ఉన్న సౌదీ అరేబియాకు చెందిన అరామ్‌కో రిఫైనరీ (సామ్రెఫ్)పై డ్రోన్లతో దాడి చేసింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రిఫైనరీ దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా లేదా అనే విషయం తెలియరాలేదు. మరో వైపు తమ దేశంలపైకి దూసుకొచ్చిన 8 బాలిస్టిక్ మిసైల్స్‌ను అడ్డుకున్నట్టు సౌదీ అరేబియా వెల్లడించింది. పరిస్థితి ఇలాగే ఉంటే సైనిక చర్య తప్పదని ఇరాన్‌కు సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే, కువైట్‌లోని అతిపెద్ద రిఫైనరీలైన మినా అల్- అహ్మదీ, మినా అబ్దుల్లాలపై కూడా డ్రోన్ దాడులు జరగడంతో అక్కడ మంటలు చెలరేగాయి. ఈ ఘటనల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
యూఏఈ ఆయిల్ ఫీల్డ్స్‌పై బాంబుల వర్షం..
యూఏఈలోని అత్యంత కీలకమైన బాబ్ ఆయిల్ ఫీల్డ్‌పై ఇరాన్ బాంబు దాడులు చేసింది. దీంతోపాటు ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌షోర్ గ్యాస్ ప్రాసెసింగ్ కేంద్రం అయిన హబ్షాన్ గ్యాస్ కాంప్లెక్స్‌పైనా మిసైల్స్, డ్రోన్స్‌తో దాడి చేసింది.
శత్రువుల క్షిపణిని గాలిలోనే యూఏఈ దళాలు అడ్డుకున్న సమయంలో దాని శకలాలు హబ్షాన్ గ్యాస్ ఫెసిలిటీ, బాబ్ ఆయిల్ ఫీల్డ్ ప్రాంతంలో పడ్డాయి. దీనివల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, ముందు జాగ్రత్త చర్యగా ప్లాంట్స్ కార్యకలాపాలను ఆపివేశారు. యూఏఈ సమీపంలో ఓ నౌకపైనా దాడి జరిగింది. ఈ విషయాన్ని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ వెల్లడించింది.
కోలుకునేందుకు ఐదేండ్లు !
దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడిలాంటి ఆయిల్ రిఫైనరీలపై ఇరాన్ చేసిన దాడులతో ఖతార్‌కు భారీ నష్టం జరిగింది. ఈ దాడుల కారణంగా ఎల్‌ఎన్‌జీ ఎగుమతుల్లో 17 శాతం వరకు ఉత్పత్తి చేసే కేంద్రాలు దెబ్బతిన్నాయని ఖతార్ ఎనర్జీ తెలిపింది. వాటి మరమ్మతులకు 3 నుంచి 5 ఏండ్లు పడుతుందని తెలిపింది. ఖతార్‌పై ఇలాంటి దాడులు జరుగుతాయని, అదీ రంజాన్ మాసంలో తమ సోదర దేశమే చేస్తుందని అనుకోలేదని ఖతార్ ఎనర్జీ సీఈవో పేర్కొన్నారు.
ఇంధన కేంద్రాలపై దాడి జరిగితే ‘అస్సలు తగ్గం’: ఇరాన్ హెచ్చరిక
తమ దేశ ఇంధన వనరులే లక్ష్యంగా మళ్లీ దాడులు జరిగితే తాము ఏమాత్రం వెనక్కి తగ్గబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ హెచ్చరించారు. గతంలో ఇరాన్ మౌలిక సదుపాయాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు తాము ఇచ్చిన సమాధానం, తమ అసలు శక్తిలో ఒక చిన్న భాగం మాత్రమేనని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ఉద్రిక్తతలను తగ్గించాలన్న అంతర్జాతీయ పిలుపులకు గౌరవం ఇచ్చి ఇప్పటివరకూ నిగ్రహం పాటించామని, కానీ తమ మౌలిక సదుపాయాలను మరోసారి లక్ష్యంగా చేసుకుంటే ఆ ‘సంయమనం సున్నా’ అవుతుందన్నారు.
దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఇలాంటి దాడులు ఉద్రిక్తతలను మరింత పెంచుతాయన్నారు. కాగా, తమ దేశ విద్యుత్ అవసరాల్లో 80% తీర్చే ‘సౌత్ పార్స్’ గ్యాస్ ఫీల్డ్పై ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఖండించారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా అదుపు చేయలేని పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు.
1,300కు పైగా మృతి
మూడు వారాలుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటివరకూ ఇరాన్‌లో 1,300 మందికి పైగా మరణించారు. లెబనాన్‌లో దాదాపు 10 లక్షల మంది నిర్వాసితులవ్వగా, 968 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లో ఇరాన్ క్షిపణి దాడుల వల్ల 15 మంది మరణించగా, 13 మంది అమెరికా సైనికులు కూడా ఈ ఘర్షణల్లో మృతి చెందారు.
ఇరాన్ గ్యాస్ ఫీల్డ్పై ఇజ్రాయెల్ దాడి
ఇరాన్ కు చెందిన ప్రపంచంలోనే అతిపెద్దదైన సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పై ఇజ్రాయెల్ దాడి చేసింది. బుధవారం రాత్రి ఈ గ్యాస్ ఫెసిలిటీపై ఇజ్రాయెల్ భీకరంగా మిసైళ్లతో విరుచుకుపడింది. యుద్ధం ఆరంభమైనప్పటి నుంచి ఉత్తర ఇరాన్ లో టార్గెట్లపై ఇజ్రాయెల్ అటాక్ చేయడం ఇదే మొదటిసారి. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పై దాడి చేసిన అనంతరం ఇజ్రాయెల్ మిలిటరీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
సౌత్ పార్స్ పై ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతిదాడి చేస్తామని హెచ్చరించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ (ఐజీఆర్ సీ).. కొన్ని గంటలకే ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియాలోని గ్యాస్ ఫెసిలిటీస్ పై అటాక్ చేసింది. ఐజీఆర్సీ ప్రతిదాడితో ఖతార్ ఎల్ఎన్జీ కేంద్రానికి భారీగా నష్టం జరిగింది.
కాగా, ఖతార్ లోని అతిపెద్ద ఎల్ఎన్ జీ కేంద్రంపై ఇరాన్ దాడి నేపథ్యంలో తమ దేశం నుంచి ఇరాన్ దౌత్యవేత్తలను ఖతార్ తొలగించింది. 24 గంటల్లో ఖతార్ నుంచి వెళ్లిపోవాలని ఇరాన్ దౌత్యవేత్తలను ఆ దేశం ఆదేశించింది. తమ దేశంపై ఇరాన్ అదే పనిగా దాడులు చేస్తున్నదని, ఇక ఆ దాడులను ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఖతార్ స్పష్టం చేసింది.
