నెక్స్ట్జనరేషన్ పౌర సేవలకు శ్రీకారం...‘మీ సేవ’ను మరింత బలోపేతం చేయాలి : సీఎస్ సంజయ్ జాజు

నెక్స్ట్జనరేషన్ పౌర సేవలకు శ్రీకారం...‘మీ సేవ’ను మరింత బలోపేతం చేయాలి : సీఎస్ సంజయ్ జాజు
  •     ఐటీ శాఖ రివ్యూలో సీఎస్ సంజయ్ జాజు ఆదేశం

హైదరాబాద్, వెలుగు:  ప్రజలకు అందుతున్న ప్రభుత్వ డిజిటల్ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు కొత్త టెక్నాలజీని తీసుకురావాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఐటీ శాఖ ఉన్నతాధికారులతో బుధవారం సీఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలపై ఆయన చర్చించారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సేవలు సులభంగా అందేలా కొత్త పౌర సేవా ప్లాట్‌‌ఫారమ్‌‌లను తీసుకురావాలని సూచించారు. 

ఈ-గవర్నెన్స్ సేవలను మరింత వేగంగా ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడుతున్న మీసేవ కేంద్రాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక సమస్యలు లేకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీసేవ సేవలను ఆధునీకరించాలని సూచించారు. దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను సులభతరం చేయాలని, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఐటీ శాఖ తన విధానాలను మార్చుకోవాలని సీఎస్ ఆదేశించారు. ప్రతి సామాన్యుడికి డిజిటల్ సేవలు అందేలా పనిచేయాలని అధికారులకు సూచించారు.