
ప్రస్తుత వేసవి సీజన్ తోపాటు, నైరుతి రుతుపవనా రాకకు సంబంధించి అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఆదేశించారు. సీజనల్ కండిషన్స్‌పై బుధవారం సచివాలయంలో సీఎస్ సమీక్షించారు. వడగాల్పులు కొనసాగితే వ్యవసాయ శాఖ అందుకు సన్నద్ధంగా ఉండాలని, రైతులకు అవసరమైన సలహాలు ఇవ్వాలని సూచించారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నైరుతి రుతుపనాలు బుధవారం అండమాన్‌లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని, రాష్ట్రానికి జూన్ 10 లేదా 11న చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. వర్షపాత హెచ్చరికలు ఎప్పటికప్పుడు పంపించాలని, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కంట్రోల్ రూంల ద్వారా వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
రైతులకు అవసరమైన విత్తనాలు, పశుగ్రాసంతోపాటు పౌరసరఫరాల శాఖ ద్వారా నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వర్షపాత వివరాలు రోజువారీగా అందిస్తామని, కలెక్టర్లతో సమీక్షించడానికి చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తెలిపారు. వర్షాకాల సీజన్‌లో వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నామని, మందులు సిద్ధంగా ఉంచామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి శాంతి కుమారి చెప్పారు. వర్షాకాలంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 195 మొబైల్ టీంలు పనిచేస్తాయని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సహకారంతో ఫ్లడ్ మ్యాప్స్ రూపొందిస్తున్నామని, డిజాస్టర్ రెస్పాన్స్ టీంలు 24 గంటలు పనిచేస్తాయని చెప్పారు. నాలాల పూడికతీతను 6వ తేదీ నాటికి పూర్తి చేస్తామన్నారు.