ప్రైవేటు స్కూళ్లకు ఊరట

ప్రైవేటు స్కూళ్లకు ఊరట

హైదరాబాద్‌‌, వెలుగు: ఫైర్‌‌ సెఫ్టీ ఎన్‌‌ఓసీ నిబంధన నుంచి ప్రైవేటు విద్యాసంస్థలకు త్వరలో ఊరట దక్కనుంది. 2009 కంటే ముందున్న బడుల్లో ఫైర్‌‌ పరికరాలు ఏర్పాటు చేసుకుంటే  వాటికి గుర్తింపు కొనసాగించాలని సర్కారు నిర్ణయించింది. పదేండ్ల కోసారి ప్రైవేటు బడులు విద్యాశాఖ నుంచి గుర్తింపు తీసుకోవాల్సి ఉంది. 2019–20 విద్యాసంవత్సరానికి దాదాపు వెయ్యి స్కూళ్లు ఫైర్‌‌ సేఫ్టీ  నిబంధనలు లేకుండానే గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. నేషనల్‌‌ బిల్డింగ్‌‌ కోడ్‌‌ నిబంధనల ప్రకారం ఫైర్‌‌ సెఫ్టీ తప్పనిసరి. ఈ నిబంధన అమలు చేస్తే చాలా బడులకు గుర్తింపు రావడం కష్టమే. 2009లో సుప్రీంకోర్టు ఇచ్చిన  తీర్పు ప్రకారం ఫైర్ సేఫ్టీ  పరికరాలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని మేనేజ్ మెంట్లు చాలా రోజులుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. రెండ్రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి  విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఫైర్‌‌ సెఫ్టీపై 2009 తర్వాత వచ్చిన బడులు, అంతకు ముందున్న బడులుగా విభజించి నిబంధనలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. దీంతో ఆరు వేల బడులకు ఊరట లభించనుంది.