పంటల సాగులో 2020 రికార్డును తిరగరాసిన రైతాంగం

పంటల సాగులో 2020 రికార్డును తిరగరాసిన రైతాంగం

హైదరాబద్‌‌, వెలుగు: రాష్ట్ర చరిత్రలో వానాకాలం పంటల సాగు ఆల్‌‌ టైం రికార్డు సృష్టించింది. అన్ని రకాల పంటలు కలిపి ఈ యేడు సాగు భారీగా నమోదైంది. 2020 వానాకాలంలో రికార్డ్ స్థాయిలో1,35,63,492 ఎకరాల సాగు నమోదు  కాగా, ప్రస్తుత వానాకాలం సీజన్ లో రైతులు ఈ రికార్డును బద్దలుకొట్టారు. ఈ ఖరీఫ్ లో1,35,75,687 ఎకరాల్లో పంటలు సాగు చేసి కొత్త రికార్డు నమోదు చేశారు. రాష్ట్రం వచ్చిన 2014 -15 వానాకాలం సీజన్‌‌లో కోటి మూడు లక్షల ఎకరాల్లో పంటలు సాగు అయ్యాయి. ఇప్పుడు దాని కంటే 32 లక్షల ఎకరాలు అదనంగా సాగు జరిగింది. 2019–20 నాటికి వానాకాలంలో 1.21 కోట్ల ఎకరాలు సాగు చేయగా, 2020–21లో రికార్డు స్థాయిలో 1.35 కోట్ల ఎకరాల్లో పంటలు వేశారు. అయితే, 2021–22 వానాకాలంలో 1.30 కోట్ల ఎకరాల్లోనే పంటల సాగు జరిగింది. ఇక ఈ యేడు వానాకాలంతో పాటు యాసంగిలో సాగు పెరిగి రెండు సీజన్‌‌లలో కలిపి 2 కోట్ల ఎకరాలు దాటుతుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. 

టాప్‌‌లో వరి.. ఆ తర్వాత పత్తి   

ఈ యేడు వానాకాలంలో  రైతులు వరి నాట్లు రికార్డు స్థాయిలో వేశారు. ఇప్పటివరకు 64.31 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. నిరుడు 62.13 లక్షల ఎకరాల్లోనే వరి సాగు అయింది. ఈ యేడు అంతకు మించి వరి సాగు జరిగింది. ఈ నెలాఖరు వరకు సాగుకు వీలుండడంతో 65 లక్షల ఎకరాల మార్కును దాటే అవకాశం ఉందని అంటున్నారు.  దీందో ఈ యేడు పంట కొనుగోళ్లపై దిగుబడి అంచనాలు రూపొందించేందుకు వ్యవసాయ శాఖ సిద్దమైంది. రాష్ట్రం వచ్చే నాడు సాగైన వరి కంటే నేడు రెట్టింపునకు పైగా వరి సాగు కావడం గమనార్హం. ఇక పత్తి సాగు 70 లక్షల ఎకరాలకు పెంచాలని సర్కారు చెప్పినా 50 లక్షల ఎకరాలు కూడా దాటలేదు.  

తగ్గిన కంది.. పెరిగిన మక్క, సోయా 

ఈ ఏడాది 1.43 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ టార్గెట్‌‌ పెట్టింది. అందులో బుధవారం నాటికి కోటి 35 లక్షల 75 వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. జులై నెలలో భారీ వర్షాలు కురవడంతో  పునాస పంటలపై ఎఫెక్ట్‌‌ పడింది. దీంతో పత్తి 49.98 లక్షల ఎకరాలకే పరిమితమైంది.  కంది సాగుకు సర్కారు 15 లక్షల ఎకరాలు టార్గెట్‌‌ పెట్టగా.. 5.61 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. మక్కల టార్గెట్‌‌ 5 లక్షల ఎకరాలు కాగా,  రైతులు టార్గెట్‌‌ దాటి 6.20 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఈ యేడు వాతావరణం అనుకూలంగా ఉండడంతో సోయాబీన్‌‌ టార్గెట్‌‌ 3.50 లక్షల ఎకరాలను మించి  4.33 లక్షల సాగయింది.   

సాగులో ఆల్‌‌టైం రికార్డ్  

రాష్ట్ర చరిత్రలోనే వానాకాలం పంటల సాగు ఆల్‌‌టైం రికార్డు సాధించింది. ప్రాజెక్టులు పూర్తవడంతో రిజర్వాయర్లు, చెరువుల్లో నీళ్లు నిండాయి. రైతాంగానికి ఉచిత కరెంటు కూడా ఇవ్వడంతో పెద్ద ఎత్తున పంటలు సాగు చేశారు. రెండు సీజన్‌‌లలో రెండు కోట్ల ఎకరాలపైనే పంటల సాగుతో రాష్ట్రం రికార్డు సృష్టించనుంది. తెలంగాణ దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదుగుతోంది.  
- పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి, చైర్మన్, రైతు స‌‌మ‌‌న్వయ సమితి