పప్పులు, నూనె గింజల సాగు తగ్గుతుంది

పప్పులు, నూనె గింజల సాగు తగ్గుతుంది
  • ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం సున్నా
  • మొత్తం సాగులో వరి, పత్తి పంటలే 80 శాతం
  • పప్పులు, నూనెగింజలు, పండ్లు, కూరగాయల సాగు 20 శాతమే
  • దిగుమతులపై ఆధారపడక తప్పని పరిస్థితి

వెలుగు, నెట్​వర్క్​: రాష్ట్రంలో పప్పులు, నూనెగింజల సాగు తగ్గుతున్నది. ఒకప్పుడు వీటిని మస్తుగా పండించిన రైతులు ఇప్పుడు అటు దిక్కు చూడటం లేదు. రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్క కంది తప్ప మిగిలిన పప్పులు, నూనె గింజల సాగు చాలా తగ్గింది. 80 శాతం భూముల్లో వరి, పత్తి సాగవుతుండగా, కేవలం మిగిలిన 20 శాతం భూముల్లోనే పప్పులు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు సాగవుతున్నాయి. వరికి ప్రత్యామ్నాయంగా పత్తిని సాగుచేయాలని ప్రభుత్వం చెప్తోంది తప్ప పప్పులు, నూనెగింజల సాగుపై పెద్దగా అవగాహన కల్పించడం లేదు. దీంతో వీటిని వేరే రాష్ట్రాల నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఒకప్పుడు సగటున 5 లక్షల ఎకరాల్లో సాగయ్యే పల్లి ప్రస్తుతం 39 వేల ఎకరాలకు, 3.75 లక్షల ఎకరాల్లో సాగయ్యే పెసర 1.56 లక్షల ఎకరాలకు, 1.5 లక్షల ఎకరాల్లో సాగయ్యే మినుము 47 వేల ఎకరాలకు, 7.5 లక్షల ఎకరాల్లో సాగయ్యే సోయాబీన్ 1.33 లక్షల ఎకరాలకు పరిమితయ్యాయి. పదేండ్ల కింద కనీసం లక్ష ఎకరాలకు తగ్గకుండా పండిన పొద్దుతిరుగుడు పంట ఇప్పుడు పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. 

కొన్నేండ్లుగా వరి, పత్తి సాగు పెరుగుతున్నది. రాష్ట్రంలో పత్తి సాధారణ విస్తీర్ణం 48 లక్షల ఎకరాలు కాగా, 2019, 2020 వానకాలం సీజన్లలో సుమారు 60 నుంచి 65 లక్షల ఎకరాల్లో పండించారు. వరి సాధారణ సాగు విస్తీర్ణం 44 లక్షల ఎకరాలు కాగా, గడిచిన వానకాలం, యాసంగి సీజన్లలో 50‌‌ నుంచి 55 లక్షల ఎకరాల్లో సాగుచేసినట్లు వ్యవసాయశాఖ లెక్కలు చెప్తున్నాయి. దీనికి తగినట్లే ఈ సారి వానాకాలం సీజన్​లో సుమారు 70 లక్షల ఎకరాల్లో పత్తి, 42 లక్షల ఎకరాల్లో వరి సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. యాసంగిలో వరి సాగు అంచనాలను మించిపోవడం, వడ్ల కొనుగోలులో సమస్యలు తలెత్తడంతో ఈసారి 42 లక్షలకు అంచనా కుదించినప్పటికీ 55 లక్షల ఎకరాల్లో సాగయ్యే చాన్స్​ ఉంటుందని వ్యవసాయశాఖ ఆఫీసర్లు భావిస్తున్నారు. ఇలా ఏ లెక్కన చూసినా వరి, పత్తి సాగుపెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో మొత్తం కోటీ 40 లక్షల ఎకరాల సాగు భూములు ఉండగా, దాదాపు 80 శాతం ఈ రెండు ప్రధాన పంటలే ఆక్రమిస్తున్నాయి. 

మక్కలు, చెరుకు, మిర్చి, పండ్లు, కూరగాయలదీ అదే పరిస్థితి
14  లక్షల ఎకరాల్లో సాగయ్యే మక్కను ఈసారి 2.27 లక్షల ఎకరాలకు పరిమితమైంది. మక్కను పండించొంద్దని ప్రభుత్వమే చెబుతోంది. చెరుకు పరిస్థితి చూస్తే.. 2014 వరకు సగటున లక్ష ఎకరాల విస్తీర్ణంలో సాగయ్యే పంట ప్రస్తుతం 38 వేల ఎకరాలకు పరిమితమైంది. మిర్చి 2 లక్షల ఎకరాల్లో, పసుపు లక్ష ఎకరాల్లో , కూరగాయలు లక్ష ఎకరాల్లో, అన్ని రకాల పండ్ల తోటలు కలిపి 5.78 లక్షల ఎకరాలకే పరిమితమైనట్లు వ్యవసాయశాఖ లెక్కలు చెప్తున్నాయి. 

విత్తనాలు ఉంటలేవ్​
వరికి ప్రత్యామ్నాయంగా పత్తిని మాత్రమే ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది తప్ప ఇతర పంటలను పట్టించుకోవడం లేదు. మార్కెట్​లో ఇతర పంటల విత్తనాలను కూడా  అందుబాటులో ఉంచడం లేదు. నూనె గింజలు, పప్పులు, పండ్లు, కూరగాయలకు  ప్రజల నుంచి మంచి డిమాండ్​ ఉంటున్నప్పటికీ  సరైన మార్కెటింగ్​లేదు. అడపాదడపా ఉన్న మార్కెట్లన్నీ దళారుల చేతుల్లో నడుస్తున్నాయి. ఇలాంటి మార్కెటింగ్​వ్యవస్థ వల్లే గతేడాది కంది రైతులు, తాజాగా మామిడి రైతులు భారీ మొత్తంలో నష్టపోయారు.

పర్యావరణానికి నష్టం, సామాన్యులకు కష్టం
పంట మార్పిడి చేయకుండా తరుచూ వరి, పత్తి సాగుచేయడం వల్ల పర్యావరణానికి నష్టం,  పప్పులు, నూనెగింజలు, కూరగాయలు, పండ్ల ఉత్పత్తి తగ్గితే సామాన్యులకు కష్టాలు తప్పవని పర్యావరణవేత్తలు, న్యూట్రిషియనిస్టులు హెచ్చరిస్తున్నారు. పత్తి సాగు విస్తీర్ణం పెంచాలన్న ప్రభుత్వ ప్లాన్లతో పంట భూములకు, పర్యావరణానికి తీరని నష్టం జరుగుతోంది. అందులోనూ రాష్ట్రంలో నిషేధిత హెచ్​టీ, బీటీ- 3 (బోల్​గార్డ్​) పత్తి సాగు ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. ఒక అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా పత్తి సాగులో 20 శాతం బీటీ 3  రకం ఉంటే , మన రాష్ట్రంలో  ఇది 30 శాతం దాటి పోయింది. కలుపు తీసేందుకు కూలీలు దొరకడంలేదనే కారణంతో రైతులు బీటీ 3 రకం పత్తిని  సాగుచేస్తున్నారు. సీడ్​ మొలకెత్తిన నాలుగు వారాలలోపు గ్లైఫోసేట్ హెర్బిసైడ్ పిచికారీ చేయడం వల్ల పత్తి తప్ప కలుపు మొక్కలన్నీ చనిపోతున్నాయి. ఇలా కలుపు నివారణ మందులను, పురుగు మందులను విచ్చలవిడిగా వాడడం వల్ల భూములన్నీ నిస్సారమవుతున్నాయి. పొరపాటున పత్తి కట్టెను మేసిన పశువులు కూడా చనిపోతున్నాయి. వానపాములు, మిత్రపురుగులు అంతరిస్తున్నాయి. రైతులు క్యాన్సర్​ లాంటి రోగాలబారిన పడుతున్నారు. ఒక్కసారి బీటీ- 3 రకం పత్తి సాగుచేస్తే ఆ భూమిలో కొన్నేండ్ల వరకు ఇతర పంటలు పండించే విషయాన్ని దాదాపు మరిచిపోవాలని సైంటిస్టులు  హెచ్చరిస్తున్నారు. అదే పనిగా వరి సాగుచేసే పొలాలదీ ఇదే పరిస్థితి. మరోవైపు పప్పులు, నూనె గింజలు, కూరగాయలు, పండ్లను స్థానికంగా కావాల్సినంత పండించక పోవడం వల్ల వాటి ఉత్పత్తి తగ్గి, ధరలు పెరిగి సామాన్యులు న్యూట్రిషన్​ఫుడ్​కు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయంగా పత్తికి బదులు పప్పుదినుసులు, నూనెగింజల సాగును ప్రోత్సహించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కోతుల బెడద.. కూలీల కొరత.. మార్కెటింగ్ తిప్పలు
రైతులు రకరకాల కారణాలతో పప్పులు, నూనెగింజలు, పండ్లు, కూరగాయల సాగుకు ఆసక్తి చూపించడంలేదు. కోతులు, అడవి పందుల బెడద,  కూలీల కొరత వల్ల వీటిని వేయడానికి వెనుకాడుతున్నారు. కూరగాయలు, పండ్ల తోటలకు కోతుల బెడద ఎక్కువగా ఉంది. ఒక్కసారి కోతుల మంద చేనులో పడిందంటే పంటంతా నాశనమవుతోంది. పొలాల దగ్గర ఉండే జామ, బొప్పాయి, దానిమ్మలాంటి చెట్లను కూడా కోతుల కారణంగా రైతులు నరికేస్తున్నారు. ప్రభుత్వం మార్కెట్​లో సీడ్స్​ కూడా అందుబాటులో ఉంచకపోవడంతో వీటిని సాగు చేయట్లేదు. కొన్నేండ్లుగా వరి, పత్తి సాగు పెరుగుతున్నది. రాష్ట్రంలో పత్తి సాధారణ విస్తీర్ణం 48 లక్షల ఎకరాలు కాగా, 2019, 2020 వానకాలం సీజన్లలో సుమారు 60 నుంచి 65 లక్షల ఎకరాల్లో పండించారు. వరి సాధారణ సాగు విస్తీర్ణం 44 లక్షల ఎకరాలు కాగా, గడిచిన వానకాలం, యాసంగి సీజన్లలో 50‌‌ నుంచి 55 లక్షల ఎకరాల్లో సాగుచేసినట్లు వ్యవసాయశాఖ లెక్కలు చెప్తున్నాయి. దీనికి తగినట్లే ఈ సారి వానాకాలం సీజన్​లో సుమారు 70 లక్షల ఎకరాల్లో పత్తి, 42 లక్షల ఎకరాల్లో వరి సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. యాసంగిలో వరి సాగు అంచనాలను మించిపోవడం, వడ్ల కొనుగోలులో సమస్యలు తలెత్తడంతో ఈసారి 42 లక్షలకు అంచనా కుదించినప్పటికీ 55 లక్షల ఎకరాల్లో సాగయ్యే చాన్స్​ ఉంటుందని వ్యవసాయశాఖ ఆఫీసర్లు భావిస్తున్నారు. ఇలా ఏ లెక్కన చూసినా వరి, పత్తి సాగుపెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో మొత్తం కోటీ 40 లక్షల ఎకరాల సాగు భూములు ఉండగా, దాదాపు 80 శాతం ఈ రెండు ప్రధాన పంటలే ఆక్రమిస్తున్నాయి.

పప్పుల సాగులో రిస్క్ ఎక్కువ
కంది, పెసర సాగులో రిస్క్ తో పాటు పెట్టుబడి ఎక్కువ. లాభాలు కూడా తక్కువ. వరి, పత్తిని గవర్నమెంట్  కొంటున్నది.  కానీ కందులు, పెసళ్లను కొంటవోతే మార్కెట్ల దళారులు మోసం చేస్తరు. దీంతో మా మెట్ పల్లి ప్రాంతంలో రైతులందరూ వరి సాగుకే ఇష్టపడుతున్నరు.
- నీలి గంగాధర్, రైతు బండలింగపూర్, మెట్ పల్లి, జగిత్యాల జిల్లా