అడ్డంకులు లేకుండా అడుగులు.. 42% బీసీ రిజర్వేషన్లపై పకడ్బందీగా ముందుకు..

అడ్డంకులు లేకుండా అడుగులు.. 42%  బీసీ రిజర్వేషన్లపై పకడ్బందీగా ముందుకు..
  • న్యాయ నిపుణుల సలహాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు 
  • 42%  బీసీ రిజర్వేషన్లపై పకడ్బందీగా ముందుకు..  
  • కోర్టుల్లో నిలబడేలా ఇప్పటికే డెడికేటెడ్​ కమిషన్ ​ఏర్పాటు, కులగణన సర్వే 
  • బీసీల జనాభా, వెనుకబాటుతనానికి ఎంపిరికల్ డేటాతో పక్కా ఆధారాలు
  • మొత్తం 50 శాతానికి మించి రిజర్వేషన్ల అమలుకు ఇదే కీలకమంటున్న ఆఫీసర్లు 
  • ఈడబ్ల్యూఎస్ కోటాతో50% క్యాప్ దాటిన రిజర్వేషన్లు 
  • న్యాయపరంగా ఈ అంశమూ కలిసొస్తుందని భావిస్తున్న సర్కారు
  • పంచాయతీరాజ్ చట్టం–2018ని సవరిస్తూ త్వరలో ఆర్డినెన్స్ 

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నది. న్యాయ నిపుణుల సలహాలు, సుప్రీం, హైకోర్టు మార్గదర్శకాలకు తగ్గట్టు ముందుకు వెళ్తున్నది. ఇప్పటికే ప్లానింగ్​ విభాగంతో కులగణన సర్వే చేయించడం, బీసీల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి డెడికేటెడ్ కమిషన్​ను ఏర్పాటు చేయడం, ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేసి ఆర్డినెన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం.. ఇలా ప్రతి విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం ప్రభుత్వం పంపించింది. ఈ బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా ఈ బిల్లుల ఆధారంగానే  రాజ్యాంగంలోని ఆర్టికల్ 263 ప్రకారం ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జీవో ఇవ్వనున్నట్టు తెలిసింది. ఈ ఉత్తర్వుల అమలును ఇతరులెవరూ కోర్టులకు వెళ్లి అడ్డుకోకుండా ముందుగానే కేవియట్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఒకవేళ కోర్టులు అభ్యంతరం చెబితే కులగణన సర్వే ద్వారా సేకరించిన ఎంపిరికల్ డేటాతో బీసీల జనాభా, వెనుకబాటుతనాన్ని నిరూపించడానికి సిద్ధమైంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన మినహాయింపులో ఈ డేటా కీలకం కానుందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం చేసిన 103వ రాజ్యాంగ సవరణతో విద్య, ఉద్యోగాల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటినా.. సుప్రీంకోర్టు వాటిని సమర్థించింది.  ఈ అంశం న్యాయపరంగా తమకు కలిసివస్తుందని ప్రభుత్వం భావిస్తున్నది. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై జారీ చేయబోయే జీవోకు అనుగుణంగా పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 285(ఏ)కు సవరణ చేస్తూ ఆర్డినెన్స్​జారీ చేయాలని కూడా నిర్ణయించింది. ఈ ఆర్డినెన్స్ ద్వారా  285(ఏ) సెక్షన్‌‌లో స్థానిక సం స్థల ఎన్నికల్లో ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని పూర్తిగా తొలగించి, ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వే షన్లు అమలవుతాయి’ అని మాత్రమే పేర్కొని గవర్నర్‌‌‌‌తో ఆమోదముద్ర వేయించుకోవాలని సర్కార్ భావిస్తున్నది. 

కోర్టు తీర్పులకు అనుగుణంగానే..

గతంలో వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులు, ఉత్తర్వులకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. బీసీల్లోని వివిధ వర్గాల సామాజిక, ఆర్థిక స్థితిగతుల అధ్యయనానికి బీసీ డెడికేటెడ్​ కమిషన్ ​ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర ప్రణాళికా విభాగం ఆధ్వర్యంలో కులగణన చేపట్టింది. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో 56.33 శాతం మంది బీసీలు ఉన్నారు.  ఈ గణాంకాల ఆధారంగానే అసెంబ్లీలో విద్య, ఉపాధి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు బిల్లులను ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించింది. అయితే వీటిపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, ఈలోగా హైకోర్టు జోక్యం చేసుకొని రాబోయే 3 నెలల్లో లోకల్​బాడీ ఎలక్షన్స్​నిర్వహించాలని ఆదేశించడంతో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు కేబినెట్​గురువారం ఆమో దముద్ర వేసింది. అడ్వకేట్ జనరల్, న్యాయ శాఖ  సూచ నలకు అనుగుణంగా రిజర్వేషన్ల అమలు కోసం ప్రత్యేక జీవో జారీ చేయాలని నిర్ణయించింది. ఇక కేబినెట్​నిర్ణయం ప్రకారం మండలం(సర్పంచ్, ఎంపీటీసీ), జిల్లా(ఎంపీపీ, జడ్పీటీసీ), రాష్ట్రం(జడ్పీచైర్ పర్సన్​) యూనిట్‌‌గా బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి ఖరారు చేస్తూ  వారం, పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్‌‌కు సైతం ఆదేశాలు జారీ చేసింది. 

అసాధారణ పరిస్థితుల్లో 50శాతం దాటవచ్చు..

1986లో ఎన్టీఆర్​ ప్రభుత్వ హయాంలో స్థానిక సం స్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి. అప్పట్లో అది 20 శాతంగా ఉండేది. తర్వాత కోట్ల విజయ భాస్కర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రిజర్వేషన్లను 34 శాతానికి పెంచారు. 2019లో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా కేసీఆర్ ప్రభుత్వం బీసీ రిజర్వే షన్లను22 శాతానికి తగ్గించింది. ఇదిలా ఉండగా 2021లో మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాలకు కల్పించి న రిజర్వేషన్లు 50శాతం మించడంతో సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీం తోసిపుచ్చింది. 50శాతం సీలింగ్‌‌ను కోర్టు పునఃపరిశీలించాల్సిన అవసరం లేదని, రాష్ట్రాలకు వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారం 102వ రాజ్యాంగ సవరణ తర్వాత లేదని కోర్టు స్పష్టం చేసింది. ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తామని, కానీ రిజర్వేషన్లు 50 శాతానికి మించితే సమానత్వపు హక్కు ఉల్లంఘించినట్టేనని కోర్టు స్పష్టం చేసింది. అసాధారణ పరిస్థితుల్లో 50% పరిమితిని దాటవచ్చని, కానీ అలాంటి అసాధారణ పరిస్థితులను నిరూపించడానికి బలమైన డేటా ఉండాలని స్పష్టం చేసింది. వీటన్నింటినీ దృష్టిలోఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్తోంది. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయిస్తాయి. కానీ ఆయా రిజర్వేషన్ల ఖరారుకు సరైన ప్రాతిపదిక అంటే.. కులాల వారీగా జనాభా లెక్కలు గతంలో ప్రభుత్వాల దగ్గర లేవు. కేంద్రం చేపట్టే జనాభా లెక్కల్లో కేవలం ఎస్సీ, ఎస్టీలను మాత్రమే లెక్కించేవారు. బీసీల లెక్కలు లేకపోవడంతో ప్రభుత్వాల వాదనలు కోర్టుల్లో నిలబడేవి కావు. కానీ  ప్రస్తుతం రాష్ట్రంలోని కాంగ్రెస్​ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల మేరకు డెడికేటెడ్​కమిషన్‌‌ను ఏర్పాటు చేసి, కులాల స్థితిగతులపై ప్రామాణికంగా అధ్యయనం చేసింది. అలాగే ప్లానింగ్​డిపార్ట్‌‌మెంట్​సాయంతో పక్కాగా కులగణన సర్వే చేపట్టి లెక్కలు తీసింది. దీని ఆధారంగా ఎంపిరికల్ డేటాను సిద్ధం చేసింది. 

బీసీల హర్షం

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు కేబినెట్​ ఆమోదం తెలపడంపై రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు, నేతలు హర్షం వ్యక్తం చేశారు. గాంధీ భవన్​లో కాంగ్రెస్​ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో 30 బీసీ సంఘాల నాయకులు జూబ్లీహిల్స్​లోని నివాసంలో  సీఎం రేవంత్​రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

విద్య, ఉద్యోగాల్లో ఇప్పటికే 50 శాతం దాటిన రిజర్వేషన్లు

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణకు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు 2019లో 103వ రాజ్యాంగ సవరణను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ద్వారా ఆర్టికల్ 15, 16లో ప్రత్యేక నిబంధనలు చేర్చింది. ఫలితంగా ఉన్నత కులాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తున్నది.  దీంతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించి 60శాతానికి చేరాయి. దీన్ని సుప్రీం సమర్థించినందున ఈ అంశం కూడా న్యాయపరంగా తమకు కలిసివస్తుందని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నది.