
చెన్నై: అజిత్ ‘విశ్వాసం’, విజయ్ ‘పులి’, సూర్య ‘సింగం3’, విక్రమ్ ‘కోబ్రా’ సినిమాలతో కోలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న తమిళ సినీ నటుడు రోబో శంకర్ మృతి చెందాడు. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆయన వయసు 46 సంవత్సరాలు. కొన్నేళ్ల క్రితం కామెర్ల వ్యాధితో అనారోగ్యానికి గురైన ఆయన అప్పట్లో రికవరీ అయ్యారు. వారం క్రితం ఉన్నట్టుండి తన ఇంట్లో కుప్పకూలిపడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స అందించినప్పటికీ ఆరోగ్యం మరింత విషమించింది. గురువారం రాత్రి 8.30 సమయంలో ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
లివర్, కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఆయన ప్రాణాలను కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు. రోబో శంకర్ కు భార్య ప్రియాంక, కూతురు ఇంద్రజ ఉన్నారు. ఇంత తక్కువ వయసులో ఆయన మరణించడంతో కోలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన అకాల మరణానికి చింతిస్తూ కమల్ హాసన్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ పెట్టారు. శుక్రవారం రోబో శంకర్ అంత్యక్రియలు చెన్నైలో జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ధనుష్ ‘మారి’ సినిమాలో కూడా రోబో శంకర్ నటించాడు. Sotta Sotta Nenayuthu అనేది ఆయన నటించిన చివరి సినిమా.