
లండన్: బ్రిటన్లో అక్రమ వలసలకు వ్యతిరేకంగా ఇటీవల పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అక్రమ వలసలను అడ్డుకోండి.. మా దేశాన్ని మాకివ్వండి అంటూ నిరసనకారులు తమ నినాదాలతో లండన్ వీధులను హోరెత్తించారు. ఈ క్రమంలో వలసలపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక సూచన చేశారు. లండన్లో అక్రమ వలసలను ఆపాలని.. వలసదారులను అడ్డుకోవడానికి అవసరమైతే ఆర్మీని రంగంలోకి దింపాలని సూచించాడు ట్రంప్.
వలసలను అరికట్టకపోతే దేశం నాశనం అవుతోందని హెచ్చరించాడు. ట్రంప్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో గురువారం (సెప్టెంబర్ 18) భేటీ అయ్యారు ట్రంప్. ఇరువురూ దేశాధినేతల భేటీలో ఇటీవల బ్రిటన్లో అక్రమ వలసలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల గురించి డిస్కస్ చేశారు. వలసలపై అప్రమత్తమంగా ఉండాలని స్టార్మర్కు సూచించారు ట్రంప్. లేదంటే దేశం నాశనం అవుతోందని బ్రిటన్ ప్రధానిని హెచ్చరించారు.
ఇరువురి భేటీ అనంతరం ట్రంప్, స్టార్మర్ సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రిటన్లో అక్రమ వలసలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలపై రియాక్ట్ అయ్యాడు ట్రంప్. లండన్లో అక్రమ వలసలను ఆపాలని.. వలసదారులను అడ్డుకోవడానికి అవసరమైతే ఆర్మీని రంగంలోకి దింపాలని బ్రిటన్ ప్రధానికి సూచించానని చెప్పాడు ట్రంప్. అక్రమ వలసలను అడ్డుకోకపోతే చివరకు దేశమే నాశనం అవుతోందని హెచ్చరించానని అన్నారు.
కాగా, బ్రిటన్లో అక్రమ వలసలకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ‘అక్రమ వలసలను అడ్డుకోండి’.. ‘మా దేశాన్ని మాకివ్వండి’ అంటూ నిరసనకారులు తమ నినాదాలతో లండన్ వీధులను హోరెత్తించారు. ప్రముఖ జర్నలిస్ట్, జాతీయవాద యాక్టివిస్ట్ టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో శనివారం లండన్ నడిబొడ్డున జరిగిన ఈ భారీ నిరసన ర్యాలీలో సుమారు1.50 లక్షల మంది పాల్గొన్నారు.
‘యునైటెడ్ కింగ్ డమ్’ పేరుతో నిర్వహించిన ఈ ర్యాలీలో నిరసనకారులంతా బ్రిటన్ జాతీయ జెండాలు, సెయింట్ జార్జ్ రెడ్ అండ్ వైట్ ఫ్లాగ్స్, ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ‘పడవలను ఆపండి’, ‘వారిని తిరిగి పంపండి’, ‘ఇక చాలు, మన పిల్లలను కాపాడండి..’ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. మరోవైపు, వలసదారులకు మద్దతుగా స్టాండప్ టు రేసిజం గ్రూపు ఆధ్వర్యంలో ‘మార్చ్ అగైనెస్ట్ ఫాసిజం’ పేరుతో సపరేట్గా మరో ర్యాలీ జరిగింది. ఇందులో సుమారు 5 వేల మంది పాల్గొన్నారు.