బోనాలు, పోతరాజు, హర్యానా సంస్కృతి.. కరీంనగర్లో నో బ్యాగ్ డే కార్యక్రమంలో ఆకట్టుకున్న ప్రోగ్రామ్స్

బోనాలు, పోతరాజు, హర్యానా సంస్కృతి.. కరీంనగర్లో నో బ్యాగ్ డే కార్యక్రమంలో ఆకట్టుకున్న ప్రోగ్రామ్స్

జాతీయ విద్యావిధానంలో భాగంగా ప్రతి మూడో శనివారం నో బ్యాగ్ డే పాలసీని తీసుకొచ్చిన విషయం తెలిసందే. రోజూ కేజీలకొద్దీ బ్యాగులు మోస్తూ ఇబ్బంది పడే విద్యార్థులకు నెలలో ఒకరోజు పుస్తకాల మోత లేకుండా.. స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడమే దీని ఉద్దేశం. ఇందులో భాగంగా శనివారం (జులై 19) కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ స్కూల్ లో నిర్వహించిన నో బ్యాగ్ డే కార్యక్రమం ఆకట్టుకుంది. దేశంలోని వివిధ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా స్టూడెంట్స్ చేసిన ప్రోగ్రామ్స్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకున్నాయి. 

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో నో బ్యాగ్ డే సందర్భంగా .. ఏక భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం నిర్వహించారు ఉపాధ్యాయులు. ప్రతినెల మూడో శని వారం పుస్తకాల సంచులు లేకుండా స్కూలుకు వచ్చేలా నో బ్యాగ్స్ డే కార్యక్రమం ఈ పాఠశాలలో  నిర్వహిస్తున్నారు.  ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహించారు. 

హర్యాణా సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులు  ప్రదర్శించారు.  హర్యాణా సంప్రదాయ దుస్తులు ధరించి, జానపద నృత్యాలతో అలరించారు. హర్యాణా భాష, ఆచారాలు, ఆహారం, వేషభూషణాలపై విద్యార్థుల ఆకర్షణీయ ప్రదర్శనలు చేశారు. ఆ తర్వాత తెలంగాణ బోనాల పండుగను కూడా ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో పోతరాజు వేషాలు వేయించి ప్రదర్శించారు. విద్యార్థుల ప్రదర్శనలను తల్లిదండ్రులు, గ్రామస్తులు, స్థానికులు చూసి మెచ్చుకున్నారు. 

జాతీయ సమైక్యత, సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించిన "ఏక భారత్ శ్రేష్ఠ భారత్" కార్యక్రమం అని ఉపాధ్యాయులు చెప్పారు. విద్యార్థుల సృజనాత్మకత, సమగ్రతను వెలికి తీసిన కార్యక్రమం దేశ భిన్నతలో ఏకతను చాటిందని హెడ్ మాస్టర్ పురం ఉమారాణి తెలిపారు. ఇతర రాష్ట్రాల సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవిస్తూ విద్యార్థులు జాతీయ ఐక్యతను అర్థం చేసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయని చెప్పారు.