వేలల్లో వస్తున్నకరెంటు బిల్లులతో జనం షాక్

వేలల్లో వస్తున్నకరెంటు బిల్లులతో జనం షాక్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: జనాన్ని కరోనా ఎంత భయపెడుతున్నదో.. కరెంట్ బిల్లులు అంత భయపెడుతున్నాయి. వరుసగా రెండు నెలలు మీటర్ రీడింగ్ తీయకపోవటంతో చార్జీలు వేలల్లో వస్తున్నాయి. రూ.180 నుంచి 200 వరకు బిల్లులు వచ్చే యూజర్లకు రూ.3 వేల నుంచి 4 వేల వరకు వస్తున్నాయి. నెలకు రూ.500 వచ్చే యూజర్​కు ఏకంగా 8,300 బిల్లు వచ్చింది. సరాసరి యూసేజీ 200 యూనిట్లు దాటిన వారికి భారీగా బిల్లులు వస్తున్నాయి. దీంతో జనాలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే లాక్‌‌‌‌డౌన్‌‌‌‌లో చేతిలో పైసలు లేక ఇబ్బందులు పడుతున్నామని, వేలల్లో కరెంటు బిల్లులు వస్తుంటే ఎలా కట్టాలో తెలియడం లేదని జనం వాపోతున్నారు. బిల్లులు కూడా ఒక్కోచోట ఒక్కో తీరుగా ఉండటం గందరగోళానికి గురి చేస్తోంది.

బిల్లు అర్థమైతలేదు

ప్రతినెల 200 యూనిట్ల లోపే విద్యుత్‌‌‌‌ వాడుతాం. నెలకు రూ.600 నుంచి రూ.700 వరకు బిల్లు వచ్చేది. జనవరిలో రూ719, ఫిబ్రవరిలో రూ.528, మార్చిలో రూ.600 వచ్చింది. రెండు నెలలుగా మీటర్‌‌‌‌ రీడింగ్‌‌‌‌ తీయకుండా అంచనా బిల్లులు ఇవ్వడంతో కట్టలేదు. ఇప్పుడు మూడు నెలలకు కలిపి 1,163 యూనిట్లు వాడారంటూ బిల్లు ఇచ్చారు. అందులో 387 యూనిట్లు యావరేజీగా తేల్చారు. బిల్లు రూ.8318 వచ్చింది. ప్రతినెల బిల్లు వచ్చి ఉంటే రూ.4 వేల లోపే వచ్చేది. ఏం అర్థమైతలేదు.- సాహితి, లెక్చరర్, వరంగల్‌‌‌‌

200 యూనిట్లు దాటితే..

రెండు రోజులుగా విద్యుత్ సంస్థలు మీటర్ రీడింగ్ తీయటం మొదలు పెట్టాయి. సాధారణ ఎల్‌‌‌‌టీ 1(బి)(1) కరెంటు యూజర్లు 200 యూనిట్ల కన్నా ఎక్కువ వాడితే ఎల్‌‌‌‌టీ 1(బి)(2) పరిధిలోకి పోతున్నారు. దీంతో యూనిట్‌‌‌‌ ధర రూ.5గా మారిపోతోంది. ఫలితంగా బిల్లు తడిసిమోపెడవుతోంది. మార్చి, ఏప్రిల్‌‌‌‌ నెలల్లో ఎండ తీవ్రతతో వాడకం పెరగడం వల్ల రీడింగ్స్ ఎక్కువగా 200 యూనిట్లు దాటి నమోదయ్యాయి.

మార్చి, ఏప్రిల్​లో తక్కువ కరెంటు వాడిన్రు

లాక్‌‌‌‌ డౌన్‌‌‌‌ నేపథ్యంలో మీటర్‌‌‌‌ రీడింగ్‌‌‌‌ తీయడంలో ఆలస్యమైంది. రెండు నెలలు సీక్వెన్స్ తప్పడంతో మూడో నెల ప్రభావం మొదటి 2 నెలలపై పడుతోంది. మార్చి నెల 22 నుంచి రాష్ట్రంలో లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ అమలైంది. మార్చిలో విద్యుత్‌‌‌‌ వాడకం భారీగా తగ్గింది. తక్కువ ఉష్ణోగ్రతలో కరోనా ఎక్కువ ఎఫెక్ట్‌‌‌‌ చూపిస్తదని భయపడి.. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నా ప్రజలు ఏసీలు, కూలర్లు వాడలేదు. మార్చి, ఏప్రిల్‌‌‌‌లో విద్యుత్ వాడకం తక్కువగా ఉన్నా.. మే నెలలో పెరిగింది. అయితే ‘యావరేజ్’ తీస్తే దాని ప్రభావం తక్కువ విద్యుత్‌‌‌‌ వాడిన మార్చి నెలపై పడింది. స్లాబులు మారీ విద్యుత్‌‌‌‌ బిల్లులు భారీగా వచ్చాయని అధికారులు చెబుతున్నారు.

కరోనా సాకు చెప్పి..

కరోనాను సాకుగా చూపి విద్యుత్‌‌‌‌ సంస్థలు తమ నష్టాలను పూడ్చుకోవడానికి ఇలా దొంగదెబ్బ తీస్తున్నాయంటూ యూజర్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండు నెలలు రీడింగ్‌‌‌‌ తీయకపోవడం వల్లే ఈ స్థాయిలో చార్జీలు పెరిగాయని యూజర్లు వాపోతున్నారు. ఇప్పుడు రీడింగ్‌‌‌‌ తీస్తున్నట్లే రెండు నెలలుగా తీసి ఉంటే ఇలాంటి సమస్య ఉండేదని కాదని అంటున్నారు. ఈ దిశగా డిస్కంలు ఎలాంటి ప్రయత్నం చేయకుండా చేతులెత్తేసి.. అంచనా బిల్లులతో తమ కొంపలు ముంచారని ఆవేదన చెందుతున్నారు. కావాలనే విద్యుత్‌‌‌‌ సంస్థలు గత రెండు నెలలుగా మీటర్‌‌‌‌ రీడింగ్‌‌‌‌ తీయలేదని ఆరోపిస్తున్నారు.

అంచనా బిల్లులు.. రియల్ బిల్లులు

మీటర్‌‌‌‌ రీడింగ్‌‌‌‌ తీయకుండా అంచనా బిల్లుల మెసేజ్‌‌‌‌లు పంపిన అధికారులు.. ఇప్పుడు వాస్తవ బిల్లులంటూ సరాసరి లెక్కతీస్తున్నారు. దీంతో అంచనాలు భారీగా మారినట్లు తెలుస్తోంది. రెండు నెలలుగా మీటర్‌‌‌‌ రీడింగ్ తీసి ఉంటే ఈ సమస్య ఉండేది కాదని ఎక్స్​పర్టులు అంటున్నారు. కరెంటు బిల్లు రీడింగ్‌‌‌‌లో ఇప్పుడు ఇస్తున్న యావరేజ్‌‌‌‌ బిల్లింగ్స్ సైంటిఫిక్​గా లేవని చెబుతున్నారు. దీంతో మధ్యతరగతి ప్రజలపై భారం పడుతోంది. వంద, 200 యూనిట్ల వరకు విద్యుత్‌‌‌‌ వాడే ఈ వర్గాలు.. స్లాబ్‌‌‌‌ రేటు దాటి పోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పేదోళ్లకు దెబ్బ.. పెద్దోళ్లకు లాభం

యావరేజ్ కరెంటు బిల్లుల వల్ల ఎక్కువగా కరెంటు వాడే వారికి లాభం కలిగింది. వెయ్యి, ఆపైన యూనిట్లు కాల్చే వారికి బిల్లులు కలిసొచ్చాయి. మార్చిలో తక్కువ కరెంటు యూజ్ చేసి.. ఏప్రిల్, మే నెలల్లో భారీగా యూనిట్లు కాల్చినా.. సరాసరి చేయడం వల్ల వారికి కలిసొచ్చింది. ‘మే నెలలో వాడేది రూ.9.50 వరకు పోతుంది. కానీ సరాసరి చేస్తే అది రూ.5 నుంచి లెక్కలోకి వస్తుంది’ అని ట్రాన్స్‌‌‌‌కో, జెన్‌‌‌‌కో సీఎండీ  ప్రభాకర్‌‌‌‌రావు చెప్పడం గమనార్హం. కానీ పేద, మధ్య తరగతికి మాత్రం బిల్లుల్లో తేడాలతో పెద్ద దెబ్బ పడింది.

నెలకు రూ.300 లోపే వచ్చేది. కానీ ఈనెల 3,025 వచ్చింది. ప్రతినెల తీస్తే మూడు నెలలు కలిపినా రూ.1,500 లోపే వచ్చేది. ఇప్పుడు రెట్టింపు బిల్లు వచ్చింది.

– శ్రీధర్‌‌‌‌రావు, హైదరాబాద్‌‌‌‌

జనవరిలో రూ.180, ఫిబ్రవరిలో రూ180, మార్చిలో 261 వరకు కరెంట్ బిల్లు వచ్చింది.  ఏప్రిల్‌‌‌‌, మే నెలలో బిల్లు రాలేదని కట్టలేదు. ఇప్పడు రూ.3 వేలు వచ్చింది.

– రమణి, హైదరాబాద్‌‌‌‌

సరాసరి వల్ల లాభమే తప్ప నష్టం ఉండదు..

మార్చి, ఏప్రిల్‌‌‌‌ నెలల్లో తక్కువ కరెంట్ వాడి మే నెలలో ఎక్కువ వాడుతారు. మే నెలలో వాడేది రూ.9.50 వరకు పోతుంది. కానీ సరాసరి చేస్తే అది రూ.5 నుంచి లెక్కలోకి వస్తుంది. ఒక విధంగా చూస్తే తక్కువగానే ఉంటుంది. కొన్నిచోట్ల తప్పితే ఎక్కడా సమస్య ఉండదు. కరోనా ప్రభావంతో ఇప్పటికే రావాల్సిన చార్జీలు వసూలు కాక సంస్థలు ఇబ్బందిలో ఉన్నాయి. రూ.2,000 కోట్లు రావాల్సి ఉండగా రూ.800 కోట్లు మాత్రమే వచ్చాయి.

– ప్రభాకర్‌‌‌‌రావు, సీఎండీ, ట్రాన్స్‌‌‌‌కో, జెన్‌‌‌‌కో

తహసీల్దార్ల అధికారాల్లో కోత