Cricket World Cup 2023: వరుసగా రెండో సెంచరీ.. రికార్డుల వర్షం కురిపించిన డికాక్‌

Cricket World Cup 2023: వరుసగా రెండో సెంచరీ.. రికార్డుల వర్షం కురిపించిన డికాక్‌

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డీకాక్ రికార్డుల వర్షం కురిపించాడు. వరుసగా రెండో మ్యాచ్‌లో సెంచరీ సాధించిన ఈ 30 ఏళ్ల బ్యాటర్.. అంతర్జాతీయ వన్డేల్లో 19వ శతకాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో వరల్డ్‌ కప్‌ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన దక్షిణాఫ్రికా క్రికెటర్ల జాబితాలో చోటు సంపాదించాడు. 4 సెంచరీలతో దిగ్గజ బ్యాటర్‌ ఏబీ డివిలియర్స్‌ అగ్రస్థానంలో ఉండగా.. హషీం ఆమ్లా(2), ఫాఫ్‌ డుప్లెసిస్‌(2), హర్షల్‌ గిబ్స్‌(2)లతో రెండోస్థానంలో నిలిచాడు.

గతంలో డివిలియర్స్ 2011 వరల్డ్ కప్‌ టోర్నీలో వెస్టిండీస్, నెదర్లాండ్స్‌పై 107*, 134 పరుగులు చేసి ఈ రికార్డు సాధించిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు ఆ జాబితాలోకి డికాక్ చేరిపోయాడు. అంతేకాదు, ప్రపంచ కప్‌లో వరుస ఇన్నింగ్స్‌లలో సెంచరీలు బాదిన ఓవరాల్‌గా 15వ క్రికెటర్‌గా నిలిచాడు.

గిబ్స్‌ రికార్డు బ్రేక్‌

ఈ సెంచరీతో డికాక్‌ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా మీద అత్యధిక వ్యక్తిగత స్కోరు(109) సాధించిన సౌతాఫ్రికా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు సౌతాఫ్రికా మాజీ దిగ్గజం హర్షల్‌ గిబ్స్‌ పేరిట ఉండేది. గిబ్స్ 1999 వరల్డ్‌ కప్‌ టోర్నీలో ఆస్ట్రేలియాపై 101 పరుగులు చేశాడు. ఈ జాబితాలో ప్రోటీస్ మాజీ క్రికెటర్ ఫాఫ్‌ డుప్లెసిస్‌ 100 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.

ALSO READ: Cricket World Cup 2023: స్టార్ హీరో మాస్టర్ ప్లాన్: భారత్-పాక్ మ్యాచుకు హాజరవ్వడానికి కారణం అదేనా    

ఆసీస్ టార్గెట్.. 312 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియా ముందు 312 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేసించింది. డికాక్‌(109) పరుగులు చేయగా.. ఐడెన్ మార్క్‌క్రమ్(56) పరుగులతో పర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్ వెల్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. హేజిల్ వుడ్, కమిన్స్, జంపా చెరో వికెట్ తీశారు.