- మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్, పశ్చిమాసియా సంక్షోభంపై చర్చ
- హాజరవనున్న కాంగ్రెస్ సీఎంలు, పీసీసీ చీఫ్‌లు, కమిటీ మెంబర్లు
- నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ లో ఉన్నత స్థాయి నిర్ణయాత్మక మండలి (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) భేటీ అవనున్నది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ ఆఫీసు ఇందిరా భవన్ లో ఈ సమావేశం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో.. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, నేషనల్ జనరల్ సెక్రటరీ లు కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీతో పాటు సీడీబ్ల్యూసీ మెంబర్లు హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 16 పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్న మహిళా రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నట్లు సమాచారం.
అలాగే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ(డీలిమిటేషన్)లో భాగంగా లోక్‌సభ స్థానాలు 816 కు పెంచడం, ఇందులో మహిళలకు 33 శాతం (273 సీట్లు) కేటాయింపు, పశ్చిమాసియాలో సంక్షోభంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 2029 లో జరిగే సాధారణ ఎన్నికల నుంచి చట్టసభల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్‌లో దీనికి ఆమోదం తెలిపినట్లు సమాచారం.
ఇందుకు అనుగుణంగా.. వచ్చే గురువారం (ఏప్రిల్ 16) నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రత్యేక సెషన్స్‌పై కాంగ్రెస్ పార్టీ సమాయత్తమం అవుతుంది. కేంద్రం తెచ్చే ఈ బిల్లులపై సభలో ఎలా? వ్యవహరించాలన్న దానిపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అలాగే, గురువారం జరిగిన కేరళ, పుదుచ్చేరి, అస్సాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళి.. ఈ నెల 23, 29న జరగనున్న వెస్ట్ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమీక్ష జరపనుంది.
అయితే.. ఈ సీడబ్ల్యూసీ భేటీకి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తెలంగాణ, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ సీఎంలతో పాటు, అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు, సీడబ్ల్యూసీ సభ్యులు హాజరుకానున్నారు. ఈ భేటీలో పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. అలాగే పీసీసీ చీఫ్మహేశ్ కుమార్ గౌడ్, ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ కూడా శుక్రవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు.
ఎన్నికల అంశంగా వాడుకుంటున్నరు
మహిళ రిజర్వేషన్ల అంశాన్ని బీజేపీ ఎన్నికల అంశంగా వాడుకుంటోందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ‘‘ప్రధానంగా వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో ‘రాజకీయ లబ్ధి పొందడం’ కోసమే అత్యవసరంగా పార్లమెంట్ ముందుకు ఈ బిల్లు వస్తున్నది. ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే’’ అని విమర్శిస్తున్నది. ఇక హడావుడిగా చేసే డీలిమిటేషన్ తో దేశంలో ప్రమాదకర పరిస్థితులకు దారిస్తోందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ హెచ్చరించారు.
రాష్ట్రాల లోక్ సభలో 50 శాతం సీట్ల పెంపు చేయాలని భావిస్తోన్న కేంద్ర ఆలోచనపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, అందువల్ల పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ పై రాజ్యాంగాన్ని సవరించడంలో తొందరపాటు వద్దని కేంద్రానికి సూచిస్తున్నది.
