cyber crime stories : సైబర్ మోసం.. పార్ట్ టైం జాబ్ అని నమ్మించి రూ. లక్షల్లో లూటీ

cyber crime stories : సైబర్ మోసం.. పార్ట్ టైం జాబ్ అని నమ్మించి రూ. లక్షల్లో లూటీ

cyber crime stories : సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆ ఉచ్చులో పడి అమాయకులు మోసపోతున్నారు. రోజుకో కొత్త రకం మోసంతో నేరగాళ్లు వల వేస్తున్నారు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు అనుకున్నవాళ్ల ఆశల్ని సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా మరొక సైబర్ స్కామ్ తెరమీదకు వచ్చింది. యూట్యూబ్ లో లైక్ కొడితే చాలు.. ఒక్కో లైక్ కు రూ.50 ఇస్తామని నమ్మించారు. ఇన్వెస్ట్ మెంట్ పేరుతో  ఆరుగురు వ్యక్తులనుంచి దాదాపు రూ.75 లక్షలు మేర లూటీ చేశారు. విషయం తెలుసుకున్న బాదితులు మోసపోయామని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

భరత్ నగర్ కు చెందిన ఓ యువకుడికి పార్ట్ టైం జాబ్ ఉందంటూ వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది. ఇంట్లో కూర్చొని పార్ట్ టైం జాబ్ చేస్తూ సంపాదిచొచ్చు అనుకున్న ఆ యువకుడు.. తనకు మెసేజ్ వచ్చిన వాట్సాప్ నెంబర్ కు కాల్ చేసి మాట్లాడాడు. ఉద్యోగం వచ్చే వరకు వాళ్లు పంపించే యూట్యూబ్ వీడియోలకు లైక్స్ కొట్టాలని.. ఒక్కో లైక్ కు రూ.50 ఇస్తామని నమ్మించారు. కొద్ది రోజుల వరకు లైక్ కు రూ.50 చొప్పున చెల్లిస్తూ వచ్చారు. 

ఆ తర్వాత మొదలయింది.. అసలు కథ. పార్ట్ టైం జాబ్ లో ఇన్వెస్ట్ మెంట్ చేయాలంటూ.. దశల వారీగా రూ. 25 లక్షలు చెల్లించుకున్నారు. ఆ డబ్బంతా తీసుకొని ఉడాయించారు. ఇలానే బతుకు దెరువు కోసం సిటీకి వచ్చిన ఓ రైతుకు ఇలానే జరిగింది. పార్ట్ టైం జాబ్, ఇన్వెస్ట్ మెంట్ పేరుతో అతని దగ్గర కూడా రూ. 25 లక్షలు కాజేశారు. షేక్ పేట్ వ్యక్తి దగ్గర రూ. 9 లక్షలు, యూసఫ్ గుడ వాసి దగ్గర రూ.10 లక్షలు... ఇలా చాలామంది దగ్గర మాయ మాటలు చెప్పి డబ్బు తీసుకొని బోర్డు తిప్పేశారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.