- ముగిసిన నామినేషన్ల విత్ డ్రా
- పాలమూరు కార్పొరేషన్ బరిలో 347 మంది అభ్యర్థులు
మహబూబ్ నగర్ అర్బన్/వనపర్తి/నాగర్‌కర్నూల్/గద్వాల/ ఆమనగల్లు, వెలుగు : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన అభ్యర్థుల నామినేషన్ ల విత్ డ్రా మంగళవారం ముగిసింది. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారానికి పక్కా ప్రణాళికలతో సిద్ధమయ్యారు.
మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో ..
మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, 781 మంది నామినేషన్లు వేశారు. స్క్రూటినీ అనంతరం 516 క్యాండిడేట్ల నామినేషన్లు ఆఫీసర్లు ఒకే చేశారు. ఈనెల 1 నుంచి 3 వరకు నామినేషన్ల విత్ డ్రా ఉండడంతో, ఆయా ప్రధాన పార్టీల నుంచి లీడర్లు ఆది, సోమవారాల్లో ఆశావహులను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. మంగళవారం కొందరిని ఒప్పించి నామినేషన్లను విత్ డ్రా చేయించారు.
దీంతో ఈ ఎన్నికల బరిలో మొత్తం 347 మంది మిగిలారు. అందులో 127 మంది ఇండిపెండెంట్లు ఉండగా, మిగతా 220 మంది ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. పార్టీల వారీగా కాంగ్రెస్ నుంచి 60 మంది, బీఆర్ఎస్ నుంచి 58, బీజేపీ నుంచి 52, జనసేన నుంచి 18, ఎంఐఎం నుంచి 16 మంది, ఆప్ నుంచి ఇద్దరు, బీఎస్పీ నుంచి ఏడుగురు, సీపీఎం నుంచి ఒకరు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి ముగ్గురు, ఇతర రిజిస్ర్టర్ పార్టీల నుంచి ముగ్గురు ఎన్నికల బరిలో నిలిచారు.
వనపర్తి జిల్లాలో..
వనపర్తి జిల్లాలోని అమరచింత, ఆత్మకూరు, కొత్తకోట, పెబ్బేరు, వనపర్తి మున్సిపాలిటీల్లో 80 వార్డు స్థానాలకు గాను వివిధ రాజకీయపార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు 341 మంది బరిలో ఉన్నారు. అమరచింతలో 10వార్డులకు గాను బీజేపీ నుంచి 10, సీపీఎం నుంచి 3, కాంగ్రెస్ నుంచి 7, బీఆర్ఎస్నుంచి 10, సీపీఐ నుంచి 5 , స్వతంత్ర అభ్యర్థులు 10 మంది బరిలో నిలిచారు. ఆత్మకూరులో 10 వార్డులకు గాను బీజేపీ నుంచి 10, కాంగ్రెస్ నుంచి 10, బీఆర్ఎస్ నుంచి 9, ఎంఐఎం నుంచి ఒకరు, జేఎస్పీ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థులు 10 మంది బరిలో ఉన్నారు.
కొత్తకోటలో 15 వార్డులకు గాను బీఎస్పీ నుంచి 2, బీజేపీ నుంచి 13, కాంగ్రెస్‌నుంచి 15, ఎంఐఎం నుంచి ఒకరు, బీఆర్ఎస్నుంచి 15, జేఎస్పీ నుంచి 2, స్వతంత్ర అభ్యర్థులు 8 మంది బరిలో నిలిచారు. పెబ్బేరులో 12 వార్డులకు గాను కాంగ్రెస్‌నుంచి 12 , బీజేపీ నుంచి 10, బీఆర్ఎస్ నుంచి 12, బీఎస్పీ నుంచి 4 , సీపీఎం నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థులు ఆరుగురు బరిలో ఉన్నారు. వనపర్తిలోని 33 వార్డులకు గాను బీజేపీ నుంచి 33, బీఎస్పీ నుంచి 2, సీపీఎం నుంచి 2, కాంగ్రెస్ నుంచి 31, జేఎస్పీ నుంచి 2, స్వతంత్ర అభ్యర్థులు 46 మంది బరిలో నిలిచారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో..
నాగర్ కర్నూల్ జిల్లాలోని నాగర్ కర్నూల్మున్సిపాలిటిలో 24 వార్డులకు గాను 102 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి 24 మంది పోటీలో ఉండగా, బీజేపి నుంచి 22 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీఎస్పీ, సీపీఐ అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు భారీగా బరిలో ఉన్నారు. చైర్పర్సన్ రేసులో కాంగ్రెస్ నుంచి పొడుగు శ్రీనివాస్, సురేంద్ర పేర్లు ప్రచారంలో ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి తిమ్మాజీపేట పాండు ఉన్నారు.
కల్వకుర్తి మున్సిపాలిటీలోని 22 వార్డులలో 81 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి 22 మంది చొప్పున అభ్యర్థులు బరిలో ఉండగా, బీజేపీ నుంచి 21 మంది, ఎంఐఎం నుంచి 3, సీపీఐ 2, ఇండిపెండెంట్లు11 మంది పోటీపడుతున్నారు. చైర్పర్సన్అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి బృంగి రత్నమాల, బీఆర్ఎస్ నుంచి ఎడ్మ రాధిక పేర్లు ఖరారు అయ్యాయి. కొల్లాపూర్ మున్సిపాలిటీలో 19 వార్డులకు గాను 60 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్,బీజేపీల నుంచి అన్ని వార్డుల్లో పోటీ చేస్తున్నారు. బీఎస్పీ, ఇండిపెండెంట్అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఆమనగల్లులో 54 మంది..
ఆమనగల్లు మున్సిపల్ ఎన్నికల బరిలో54 మంది అభ్యర్థులు ఉన్నట్లు కమిషనర్ శంకర్ తెలిపారు. మున్సిపాలిటీకి నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియలో 15 వార్డులకు 72 మంది 109 నామినేషన్లు దాఖలు చేసినట్లు వివరించారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ లో 18 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకోగా బరిలో 54 మంది ఉన్నట్లు పేర్కొన్నారు.
గద్వాల జిల్లాలో..
గద్వాల : గద్వాల మున్సిపాలిటీలో 37 వార్డులకు గాను మొత్తం 232 మంది కలిపి 308 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల విత్ డ్రా అనంతరం 65 మంది తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకోగా 167 మంది బరిలో ఉన్నారు. అలంపూర్ మున్సిపాలిటీలో 10 వార్డులకు గాను 45 నామినేషన్లు దాఖలు అయ్యాయి.
మంగళవారం తొమ్మిది మంది అభ్యర్థులు తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. 35 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆలంపూర్ మున్సిపాలిటీలో పదవ వార్డుకు ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో ఎరుకలి విక్రమ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల ఆఫీసర్ మంజుల మున్సిపల్ కమిషనర్ శంకర్ నాయక్ కౌన్సిలర్ గా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని అందించారు.
వడ్డేపల్లి మున్సిపాలిటీలో మొత్తం పది వార్డులు ఉండగా 57 మంది నామినేషన్లు వేశారు మంగళవారం 11 మంది తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. ఆరు డబుల్ నామినేషన్లను ఉపసంహరించుకోగా, మొత్తం 40 మంది బరిలో ఉన్నారు. ఐజ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా,103 మంది నామినేషన్లు వేశారు. విత్ డ్రా అనంతరం 63 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 77 వార్డులకు గాను బీజేపీ 68, కాంగ్రెస్ 76, బీఆర్ఎస్ 77, బీఎస్పీ నలుగురు, ఇండిపెండెంట్లు 44 మంది, సీపీఎం ఒకరు, సిపిఐ ఒకరు, ఏఐఎఫ్ బీ10, జేఎస్పీ 10 మందితో పాటు ఇతర పార్టీలు అన్నీ కలిపి మొత్తం 299 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
