- ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ
- బుజ్జగింపులతో బరి నుంచి తప్పుకున్న రెబల్స్
- ఏదులాపురం 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం
- ఇండిపెండెంట్లకు గుర్తుల కేటాయింపు పూర్తి
ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగియడంతో పోటీలో ఉండే అభ్యర్థుల లెక్క తేలింది. చివరి రోజు ఆయా పార్టీలు తమ క్యాండేట్లకు బీ ఫామ్స్ అందజేయగా, టికెట్ ఆశించి భంగపడిన పలువురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మిగిలిన వారు రెబల్స్ గా మారి బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలకు ఆయా పార్టీల గుర్తులు ఇవ్వగా, ఇండిపెండెంట్లకు ఆఫీసర్లు గుర్తులు కేటాయించారు.
ఇక ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఒక్క చోట మాత్రమే వార్డు కౌన్సిలర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఏదులాపురం 15వ వార్డులో సీపీఎం, బీజేపీ అభ్యర్థులు తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి తమ్మినేని మంగతాయి ఒక్కరే పోటీలో నిలిచారు. దీంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవం అయింది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం మున్సిపల్కార్పొరేషన్, ఇల్లెందు, అశ్వారావు పేట మున్సిపాలిటీల్లో విత్ డ్రాల అనంతరం 106 డివిజన్లు, వార్డులకు 540 మంది బరిలో నిలిచారు.
ఖమ్మం జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలోని మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 117 వార్డులకు 922 నామినేషన్లు దాఖలయ్యాయి. స్క్రూట్నీ తర్వాత 787 నామినేషన్లు చెల్లుబాటు అవుతాయని గుర్తించారు. మధిరలో 22 వార్డులకు 165 దాఖలు కాగా, గడువు ముగిసేసరికి 95 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 70 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 19 , బీఆర్ఎస్ తరపున17 , సీపీఎం 3, సీపీఐ 1, జనసేన 5, బీజేపీ 19, స్వతంత్ర అభ్యర్థులు ఆరుగురు పోటీలో ఉన్నారు.
కల్లూరు మున్సిపాలిటీలో 20 వార్డులకు మొత్తం 130 మంది నామినేషన్ దాఖలు చేశారు. 58 మంది ఉపసంహరణ చేసుకోగా, 72 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో బీఆర్ఎస్ నుంచి 20 మంది, కాంగ్రెస్ నుంచి 20, బీజేపీ 16, బీఎస్పీ 3, ఇండిపెండెంట్లు 13 మంది పోటీ చేస్తున్నారు. ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డుల్లో 202 నామినేషన్లు వచ్చాయి. వాటిలో 15వ వార్డు ఎన్నిక ఏకగ్రీవం కాగా, మిగిలిన 31 వార్డుల్లో 108 మంది పోటీలో నిలిచారు.
కాంగ్రెస్ తరపున 30 మంది, బీఆర్ఎస్ 23, సీపీఎం 7, బీజేపీ 24, సీపీఐ 11 వార్డుల్లో పోటీలో అభ్యర్థులను నిలిపాయి. 13 మంది ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నారు. సత్తుపల్లిలో 23 వార్డుల్లో స్క్రూట్నీ తర్వాత 124 మంది పోటీలో నిలిచారు. వీరిలో 83 మంది బరిలో ఉండగా, 41 మంది విత్ డ్రా చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి 23, బీఆర్ఎస్ 22, బీజేపీ 22, జనసేన 4, సీపీఐ 2, సీపీఎం నుంచి ఒక్కరు, ఇండిపెండెంట్లు 9 మంది పోటీలో నిలిచారు.
వైరాలో ఉత్కంఠకు తెర..!
వైరా మున్సిపాలిటీలో 20 వార్డుల్లో మొత్తం 155 మంది నామినేషన్లు వేశారు. వీటిలో 75 మంది విత్ డ్రా చేసుకోగా, 80 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ఇక్కడ కాంగ్రెస్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గాలు వేర్వేరుగా నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు భట్టి వర్గంలో 12 మందికి బీ ఫామ్స్ దక్కగా, మంత్రి పొంగులేటి వర్గంలో ఐదుగురికి, ఎంపీ రేణుకాచౌదరి వర్గంలో ఒకరికి బీఫామ్ ఇచ్చారు.
ఒక వార్డులో సీపీఐ అభ్యర్థికి, మరొక వార్డులో సీపీఎం అభ్యర్థికి మద్దతిస్తూ కాంగ్రెస్ తరపున నామినేషన్లు వేయలేదు. మరోవైపు మున్సిపల్ చైర్పర్సన్ రేసులో భట్టి, పొంగులేటి వర్గాలు పోటీపడుతున్నట్టుగా ప్రచారం జరిగింది. చివరి రోజు భట్టి ప్రధాన అనుచరుడు, మాజీ జిల్లా కాంగ్రెస్అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ భార్య ఇందుమతి నామినేషన్ఉపసంహరించుకున్నారు. రెండు వార్డుల నుంచి ఆమె నామినేషన్లు వేసి, చివరకు పోటీ నుంచి తప్పుకోవడంతో ఉత్కంఠకు తెరపడింది.
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 540 మంది.
జిల్లాలోని కొత్తగూడెం మున్సిపల్కార్పొరేషన్, ఇల్లెందు, అశ్వారావు పేట మున్సిపాలిటీల్లో విత్ డ్రాల అనంతరం 540 మంది బరిలో నిలిచారు. వీరికి ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లకు 354 మంది పోటీలో ఉన్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీలో 22 వార్డులకు 78 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో కాంగ్రెస్-21, బీఆర్ఎస్-22, బీజేపీ-15, సీపీఐ- 1, సీపీఎం-01, జనసేన-01, ఇతరులు -13, ఇండిపెండెంట్లు నలుగురు బరిలో నిలిచారు. ఇల్లెందు మున్సిపాలిటీలో 24 వార్డులకు 08 మంది బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి24, బీఆర్ఎస్20, బీజేపీ 17, సీపీఐ 2, సీపీఎం 1, బీఎస్పీ 1, జనసేన 7, ఇండిపెండెంట్లు 36 మంది బరిలో నిలిచారు.
