ముగ్గురు సైబర్ నేరగాళ్లు అరెస్ట్.. డిజిటల్ అరెస్ట్ అంటూ వృద్దుడిని మోసం చేశారు..!

ముగ్గురు సైబర్ నేరగాళ్లు అరెస్ట్.. డిజిటల్ అరెస్ట్ అంటూ వృద్దుడిని మోసం చేశారు..!

బషీర్​బాగ్​, వెలుగు: డిజిటల్ అరెస్ట్  అంటూ ఓ వృద్ధుడిని మోసగించిన ముగ్గురిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైం డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరానికి చెందిన 71 ఏళ్ల వృద్ధుడికి స్కామర్స్ కాల్ చేశారు. సీబీఐ  అధికారిగా పరిచయం చేసుకుని మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు వృద్ధుడికి చెప్పారు. 

ఢిల్లీ క్రైం బ్రాంచ్ లో కేసు నమోదైందని, డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరించారు. నకిలీ ఎఫ్ఐఆర్ పంపించారు. కేసు నుంచి బయట పడేస్తామని చెప్పి  పలు దఫాలుగా రూ.కోటి 92 లక్షల 50 వేలు వసూలు చేశారు. సైబర్​ నేరస్తుల  పనేనని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్​స్పెక్టర్ సతీశ్ రెడ్డి, ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. 

స్కామర్స్ ఇచ్చిన బ్యాంక్ అకౌంట్స్ ఆధారంగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పాండు వినిత్(24) , తిరుపతయ్య(40), విశ్వనాథ్ (46)ను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సందీప్ అలియాస్ అలెక్స్ పరారీలో ఉన్నాడు. వీరిపై దేశవ్యాప్తంగా ఐదు, తెలంగాణలో రెండు ఇదే తరహా కేసులు నమోదయ్యాయి. వారి వద్ద నాలుగు ఫోన్లు సీజ్ చేసి రిమాండ్ కు తరలించారు.