
- ఆన్‌లైన్ గేమ్ ఆడుతుండగా సైబర్ నేరగాళ్లు అటాక్ చేశారు
- సైబర్ క్రిమినల్స్ చిన్నారులను కూడా విడిచిపెట్టడం లేదని ఆవేదన
- పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచన
- బయట జరిగే నేరాలకంటే సైబర్ నేరాలే చాలా డేంజరని వ్యాఖ్య
- సైబర్ క్రైమ్‌పై స్కూళ్లలో ఓ పీరియడ్ కేటాయించాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్
ముంబై: సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ గేమ్స్ ఆడే చిన్నారులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. పొగడ్తలతో మొదలుపెట్టి ఏకంగా న్యూడ్ ఫోటో పంపాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ తరహా సైబర్ క్రైమ్‌పై ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తన కూతురు(13) ఆన్‌లైన్ గేమ్ ఆడుతుండగా ..న్యూడ్ ఫొటోలు పంపాలని ఓ వ్యక్తి ఆమెను బెదిరించినట్లు వెల్లడించారు. వెంటనే తను ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి..జరిగిందంతా వాళ్లమ్మకు చెప్పిందని తెలిపారు. శుక్రవారం అక్షయ్ కుమార్ ముంబైలోని స్టేట్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన 'సైబర్ అవేర్‌నెస్ మంత్ 2025' ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా సైబర్ నేరగాళ్ల వల్ల తన సొంత కూతురికి ఎదురైన భయానక అనుభవాన్ని పంచుకున్నారు.
అసలు అక్షయ్ కుమార్ ఏం చెప్పారంటే..!
" కొన్ని నెలల క్రితం నా బిడ్డ ఇంట్లో ఆన్‌లైన్ వీడియో గేమ్ ఆడుతుండగా ఓ షాకింగ్ ఘటన జరిగింది. పరిచయం లేని వ్యక్తితో ఆమె ఆన్‌లైన్ గేమ్ ఆడుతున్నప్పుడు, అతడు మొదట చాలా మర్యాదగా మెసేజ్‌లు చేశాడు. 'గేమ్ బాగా ఆడుతున్నావ్', 'చాలా బాగా ఆడావ్' అంటూ పొగడ్తూ మెసేజ్‌లు పంపాడు. ఆ తర్వాత ‘నువ్వు అబ్బాయా, అమ్మాయా?’ అని అడిగాడు. దానికి నా కూతురు ‘అమ్మాయిని’ అని రిప్లై ఇచ్చింది. వెంటనే అతడు ‘నీ న్యూడ్ ఫొటోలు పంపగలవా?’ అని మెసేజ్ పంపాడు. దాంతో నా కూతురు వెంటనే గేమ్ ఆఫ్ చేసి, జరిగిందంతా నా భార్యకు చెప్పింది.ఆమె అలా మాకు చెప్పడం చాలా మంచిదైంది" అని అక్షయ్ కుమార్ వివరించారు.
ఇది కూడా సైబర్ నేరంలో భాగమే..
సైబర్ క్రైమ్స్ ఇలాగే మొదలవుతాయని తెలిపిన అక్షయ్ కుమార్..ఇది కూడా సైబర్ నేరంలో ఓ భాగమేనని వెల్లడించారు. ఇది కేవలం తన కూతురు సమస్య మాత్రమే కాదని, ఇలాంటి సైబర్ నేరాల బారిన పడి ఎంతోమంది చిన్నారులు బ్లాక్‌మెయిలింగ్‌కు గురవుతున్నారని, కొందరు ఆత్మహత్య కూడా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పిల్లలకు సైబర్ నేరాలపై అవగాహన అత్యవసరమని స్పష్టం చేశారు. స్కూళ్లలో 7 నుంచి 10వ తరగతి వరకు సైబర్‌క్రైమ్‌పై ఓ పీరియడ్ కేటాయించాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు అక్షయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డీజీపీ రష్మి శుక్లా, ఇక్బాల్ సింగ్ చాహల్ (ఐపీఎస్), రాణి ముఖర్జీ తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులు మానిటర్ చేయాలి
గతేడాది మన దేశంలో 50 వేలకి పైగా చిన్నారులపై సైబర్ దాడులు జరగడం ఆందోళన కలిగిస్తున్నది. సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమ్స్, చాట్ యాప్‌ల ద్వారా సైబర్ నేరగాళ్లు చిన్నారులతో స్నేహం చేసి, వారిపై సైబర్ దాడులకు పాల్పడుతున్నారని అధికారులు వెల్లడించారు.
చిన్నారులకు ఫేక్ లింక్‌లు, ఈమెయిల్‌లు, మెసేజ్‌ల ద్వారా ఫ్రీ గేమ్ కోడ్‌లు, బహుమతులు వంటి ఆఫర్‌లు పంపి.. వారి పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ డీటెయిల్స్ (తల్లిదండ్రులవి కూడా) దొంగిలిస్తారని చెప్పారు. ఆన్‌లైన్ గేమ్‌ల్లో గెలవగానే బాగా ఆడావని పొగుడుతూ..'ఫ్రైజ్ ఇవ్వాలంటే ఫొటోలు పంపు' అని రిక్వె్స్ట్ చేస్తారని తెలిపారు. చిన్నారులు ఫొటోలు, వీడియోలను పంపగానే ఎడిట్ చేసి అవమానకరంగా పోస్ట్ చేస్తారని...ఆపై అసభ్యకరమైన కామెంట్లు, మెసేజ్‌లతో వేధిస్తారని వివరించారు.
అందువల్ల చిన్నారుల ఆన్‌లైన్ యాక్టివిటీలను తల్లిదండ్రులు మానిటర్ చేయాలని సూచించారు. పేరెంటల్ కంట్రోల్ యాప్‌లు ఉపయోగించాలంటున్నారు. సైబర్ భద్రతపై పిల్లలకు శిక్షణ ఇవ్వడంతో తెలియని వ్యక్తులతో చాట్ చేయకూడదని చెప్పాలని పేర్కొన్నారు.