‘లండన్ లో మీ అబ్బాయికి యాక్సిడెంట్’ అంటూ.. 35 లక్షలు టోకరా .. హైదరాబాద్ లో వృద్దురాలికి కేటుగాళ్లు ఫోన్

‘లండన్ లో మీ అబ్బాయికి యాక్సిడెంట్’ అంటూ.. 35 లక్షలు  టోకరా .. హైదరాబాద్ లో వృద్దురాలికి  కేటుగాళ్లు ఫోన్
  • హైదరాబాద్ వృద్ధురాలికి కాల్ చేసి ముంచిన సైబర్ నేరగాళ్లు  
  • డబ్బులు పంపాక, కొడుకుకు ఫోన్ చేసిన తల్లి 
  • మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

  బషీర్​బాగ్, వెలుగు: లండన్ లో ఉన్న కొడుకుకు యాక్సిడెంట్ అయిందంటూ హైదరాబాద్ కు చెందిన ఓ వృద్ధురాలిని నమ్మించిన సైబర్ కేటుగాళ్లు ఏకంగా రూ. 35 లక్షలు దోచుకున్నారు. అతడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, ట్రీట్మెంట్ చేస్తున్నామని వాట్సాప్ కాల్ ద్వారా ఆందోళనకు గురి చేస్తూ డబ్బులు తమ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు.

 ఆ తర్వాత కొడుకుకు ఫోన్ కాల్ చేసిన వృద్ధురాలు మోసపోయినట్టు గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసు వివరాలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి మీడియాకు వెల్లడించారు. బాధిత వృద్ధురాలికి (61) స్కామర్స్ ముందుగా వాట్సాప్ కాల్ చేశారు. 

 తాను లండన్ లోని సౌత్ మాంచెస్టర్ హాస్పిటల్ లో యూరాలజిస్టుగా పని చేస్తున్నానని, తన పేరు డాక్టర్ స్టీవ్ రోడ్రిగ్జ్ అంటూ ఓ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. ఆమె కొడుకుకు లండన్ ఎయిర్ పోర్ట్ సమీపంలో యాక్సిడెంట్ అయిందని, తలకు తీవ్ర గాయం అయిందని చెప్పాడు. ప్రమాద సమయంలో అతని లగేజ్ కనిపించలేదని, ఐడెంటిటీ లేకపోవడంతో ఏ హాస్పిటల్ లోనూ చేర్చుకోలేదన్నారు. 

తాను చట్టవిరుద్ధంగా చికిత్స అందిస్తున్నానని స్కామర్ వివరించాడు. చికిత్స కోసం డబ్బులు చెల్లిస్తే, వైద్యం అందిస్తానని నమ్మబలికాడు. దీంతో కన్న కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని టెన్షన్ పడిన ఆమె.. ఏమీ ఆలోచించకుండా అడిగిన వెంటనే పలు దఫాలుగా స్కామర్స్ అకౌంట్ కు మొత్తం రూ.35,23,070 బదిలీ చేశారు. తర్వాత తన కొడుకు ఎలా ఉన్నాడో.. ఫోటోలు, వీడియోలు పంపించాలని కోరడంతో స్కామర్స్ సమాధానం దాటవేయడంతో ఆమెకు అనుమానం కలిగింది. 

వెంటనే ఆమె తన కొడుకు ఫోన్ నంబర్ కు కాల్ చేయడంతో.. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అతడు చెప్పాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన వృద్ధురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.