
హైదరాబాద్, వెలుగు: స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నుంచి రూ.3 కోట్లు దోచుకున్నారు. టెలిగ్రామ్‌లో ఫేక్ ట్రేడింగ్ లింకులు పంపి.. డబ్బులు కొల్లగొట్టారు. హైదరాబాద్ చందానగర్‌కు చెందిన ఆడబాల శ్రీనివాస్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఈ నెల 1న షేర్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్స్ పేరుతో ఉన్న ‘వీఐపీ 263’ టెలిగ్రామ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు యాడ్ చేశారు. ఇందులో డార్లెన్ 988 యూజర్ పేరుతో ఉన్న మహిళ శ్రీనివాస్‌ను కాంటాక్ట్ చేసింది.
stock.durocapital.net పేరుతో లింకు పంపించారు. ఈ సైట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని సూచించారు. దీంతో శ్రీనివాస్ మొదటి విడతగా రూ.50 వేలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఇందుకు గాను 6.62 శాతం లాభంవచ్చినట్లు చూపారు. ఈ క్రమంలోనే కమీషన్లు, ట్యాక్స్‌ల పేరుతో ఈ నెల 28 వరకు మొత్తం రూ.3,30,40,006 కోట్లు వసూలు చేశారు. అకౌంట్ నుంచి విత్ డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో బాధితుడు మోసపోయానని గుర్తించాడు. సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేస్తున్నారు.