లోన్ పేరిట రూ.90 వేలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

లోన్ పేరిట రూ.90 వేలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

కామారెడ్డి జిల్లా: అశోక్ నగర్ లో డ్వాక్రా సంఘం లోన్ పేరిట సైబర్ మోసం చోటు చేసుకుంది.  సైబర్ కేటుగాళ్లు బాధితుల అకౌంట్ల నుంచి మొత్తం రూ.90 వేలు కొట్టేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే... అశోక్ నగర్ కాలనీలో నివసించే ఓ  మహిళకు డ్రాక్వా సంఘం లోన్ మంజూరు అయిందంటూ  గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. మహిళతో మాట్లాడిన ఆ వ్యక్తులు ఆమెకు ఓ లింక్ పంపారు. లింక్ ఓపెన్ చేస్తే మీ అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అవుతుందని నమ్మబలికారు. లింక్ ఓపెన్ చేసిన మహిళ ఒక్కసారిగా షాక్ కు గురైంది. లింక్ ఓపెన్ చేసిన తర్వాత రెండు దఫాలుగా మొత్తం రూ.70 వేలు ఆమె అకౌంట్ నుంచి మాయమయ్యాయి. ఈ మేరకు ఆ మహిళ ఫోన్ కు మెసేజ్ కూడా వచ్చింది. వెంటనే ఆమె ఈ విషయాన్ని భర్త వెంకటరావుకు చెప్పింది. వెంటనే భర్త ఆ వ్యక్తులకు ఫోన్ చేసి నిలదీశాడు.

అయితే ఆ సైబర్ కేటుగాళ్లు భర్తకు కూడా మాయమాటలు చెప్పి నమ్మకబలికారు. అతడికి ఓ లింక్ పంపి ఓపెన్ చేయమని చెప్పారు. ఆమె భర్త లింక్ ఓపెన్ చేశాడు. ఇంకేముంది... అతడి అకౌంట్ నుంచి రూ.20 వేలు డెబిట్ అయ్యాయి. దీంతో తాము మళ్లీ మోసపోయామని గ్రహించిన ఆ దంపతులు లబోదిబోమన్నారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ చేశారు.