తెలంగాణలోని వనపర్తి సంస్థానానికి చెందిన అదితి రావు హైదరీ హీరోయిన్ గా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు. 2006లో కెరీర్‌ను ప్రారంభించిన ఈమె హిందీ, తమిళం, తెలుగు చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. తెలుగులో 'సమ్మోహనం' (2018) సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అందంతో పాటు అద్భుతమైన నటనకు ప్రసిద్ధి చెందిన అదితి.. ఇటీవల తన సహ నటుడు సిద్ధార్థ్‌ను వివాహం చేసుకుని వార్తల్లో నిలిచారు. క్లాసికల్ డ్యాన్స్ పట్ల ఆమెకున్న అనుబంధం, ఎంపిక చేసుకునే పాత్రల్లోని వైవిధ్యం అదితికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతమున్న నకిలీ సందేశాల మోసం పట్ల అప్రమత్తంగా ఉండాలని అదితి తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులను హెచ్చరించారు.
నకిలీ సందేశాలతో ఫోటోగ్రాఫర్లను టార్గెట్..
లేటెస్ట్ గా అదితీ రావు హైదరీ పేరును ఉపయోగించి ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. కొంతమంది ఫోటోగ్రాఫర్‌లు తన దృష్టికి తీసుకురావడంతో ఈ మోసం గురించి అదితీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులను, సినీ వర్గాలను అప్రమత్తం చేశారు. 'వాట్సాప్‌లో ఎవరో ఒక వ్యక్తి నా ఫోటోలను ఉపయోగించి, నాలా నటిస్తూ, ఫోటోషూట్‌ల కోసం పలువురు ఫోటోగ్రాఫర్‌లకు మెసేజులు పంపిస్తున్నాడు' అని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
కొంతమంది ఈ విషయాన్ని ఈరోజు నా దృష్టికి తీసుకొచ్చారు. అది నేను కాదు. నేను ఇలా ఎవరినీ సంప్రదించను అని అదితీ చెప్పారు. పని విషయంలో నేను వ్యక్తిగత ఫోన్ నంబర్‌ను ఉపయోగించను. ప్రతి విషయం ఎప్పుడూ నా టీమ్ ద్వారానే జరుగుతుంది. దయచేసి ఆ నంబర్‌తో సంభాషించవద్దు. మీకు ఏమైనా అనుమానాస్పదంగా అనిపిస్తే, వెంటనే నా టీమ్‌కు తెలియజేయండి. నన్ను వెనుక ఉండి సపోర్ట్ చేసే వారికి, నా పట్ల ఇంత దయగా, రక్షణగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు అంటూ అదితీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో హెచ్చరిక పోస్ట్ పెట్టారు. ఆ మోసగాడు ఉపయోగిస్తున్న నంబర్ వివరాలను కూడా అదితీ వెల్లడించారు. ఇలాంటి మోసపూరిత ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
సిద్ధార్థ్‌తో పెళ్లి
2006లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అదితీ రావు హైదరీ, తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీ, హిందీతో సహా పలు భాషల్లో నటించారు. తెలుగులో ఆమె మొదటి సినిమా 2018లో వచ్చిన 'సమ్మోహనం' మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'అంతరిక్షం', 'వి', 'మహాసముద్రం' వంటి చిత్రాలలో కనిపించారు.
'మహాసముద్రం' (2021) సినిమా షూటింగ్ సమయంలోనే ఆమె హీరో సిద్ధార్థ్‌తో ప్రేమలో పడ్డారు. దాదాపు మూడేళ్ల పాటు కొనసాగిన వీరి ప్రేమబంధం, 2024లో వివాహంతో పరిపూర్ణమైంది. ప్రస్తుతం వీరిద్దరూ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ఈ సమయంలోనే అదితీ పేరుతో మోసం జరగడం సినీ వర్గాలలో కలకలం సృష్టించింది. ఫోటోగ్రాఫర్‌లు, మేకప్ ఆర్టిస్టులు వంటి ఫ్రీలాన్సర్లను టార్గెట్ చేసే ఇలాంటి నకిలీ ప్రొఫైల్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
