- ఆర్థికసాయం చేస్తామంటూ ఇరాక్‌లో ఉన్న జగిత్యాల యువకుడికి మెసేజ్
- ట్యాక్స్ చెల్లించాలంటూ విడతల వారీగా రూ. 87 వేలు వసూలు
జగిత్యాల, వెలుగు : యూట్యూబర్ హర్షసాయి పేరుతో ఫేక్ ఫ్రొఫైల్ క్రియేట్ చేసిన సైబర్ నేరగాళ్లు, ఆర్థికసాయం పేరుతో ఓ యువకుడి నుంచి రూ. 87 వేలు వసూలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం బట్టపల్లి పోతారం గ్రామానికి చెందిన బద్ది రాకేశ్ ఉపాధి కోసం పది రోజుల కింద ఇరాక్ వెళ్లాడు. ఇతడు యూట్యూబర్ హర్షసాయిని ఫాలో అవుతుండేవాడు. ఇటీవల హర్షసాయి ప్రొఫైల్‌తో ఉన్న అకౌంట్ నుంచి రాకేశ్‌కు మెసేజ్ వచ్చింది.
‘నీ అప్పులు తీర్చేందుకు ఆర్థిక సాయం చేస్తాం’ అని చెప్పడంతో పాటు రూ. 6.5 లక్షలు పంపినట్లు స్క్రీన్‌షాట్లు పంపించారు. తన అకౌంట్‌లో డబ్బులు పడలేదని రాకేశ్ చెప్పడంతో... డబ్బులు రావాలంటే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని నమ్మించారు. దీంతో రాకేశ్ ఇండియాలో ఉన్న తన కుటుంబ సభ్యుల ఖాతాల నుంచి విడతల వారీగా రూ.87 వేలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. తర్వాత మరికొంత డబ్బు పంపాలని, లేకపోతే డిజిటల్ అరెస్ట్ చేస్తామని సదరు వ్యక్తులు బెదిరించడంతో మోసపోయినట్లు గ్రహించాడు.
