- విదేశాల్లో ఉన్న కొడుకు తమ కస్టడీలో ఉన్నాడంటూ డబ్బుల కోసం బెదిరింపులు
- బీపీ పెరిగి తీవ్ర అస్వస్థతకు గురైన హుజూరాబాద్ వాసి
హుజురాబాద్, వెలుగు: సైబర్ కాల్ ఓ వ్యక్తి ప్రాణాల మీదికి తెచ్చింది. ‘విదేశాల్లో ఉన్న మీ కొడుకు నేరం చేసి మా కస్టడీలో ఉన్నాడు. వెంటనే రూ.9 లక్షలు పంపండి.’ అని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం బోర్నపల్లి గ్రామానికి చెందిన మాసాడి లక్ష్మణ్‌రావుకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి డిమాండ్ చేశారు. టెక్నాలజీని ఉపయోగించి కొడుకు గొంతుతో మాట్లాడించడంతో నిజమని నమ్మి ఆందోళనకు గురయ్యాడు. బీపీ పెరిగి తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరాడు.
లక్ష్మణ్ రావు కొడుకు అనుదీప్ చదువు కోసం మూడేళ్ల కింద అమెరికా వెళ్లాడు. గురువారం అమెరికా నుంచి కొడుకు మాట్లాడిన అర గంట తరువాత, లక్ష్మణ్ రావుకు పోలీస్ డీపీతో ఉన్న నంబర్ నుంచి వాట్సాప్ కాల్ చేసి అతడి కొడుకు గొంతుతో మాట్లాడించారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన లక్ష్మణ్ రావు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లి, బీపీ పెరిగి కింద పడిపోవడంతో స్థానికంగా ప్రథమ చికిత్స అందించి హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని బంధువులు తెలిపారు.
