ఆరోగ్యశాఖ పేరిట ఆన్ లైన్ మోసాలు... సైబర్ నేరగాడి అరెస్ట్

ఆరోగ్యశాఖ పేరిట ఆన్ లైన్ మోసాలు... సైబర్ నేరగాడి అరెస్ట్

రాజన్నసిరిసిల్ల,వెలుగు:  ఆరోగ్యశాఖ పేరిట ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న మోసగాడిని  రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఏపీలోని కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన సలీంమాలిక్, ఢిల్లీకి చెందిన సతీశ్​కలిసి ఆరోగ్యశాఖ పేరిట ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారు.  ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలానికి చెందిన రాజిరెడ్డికి కాల్ చేశారు. ఆరోగ్య శ్రీ శాఖ నుంచి మాట్లాడుతున్నామని, మీరు వైద్యానికి ఖర్చుపెట్టిన డబ్బులు అకౌంట్ లో జమ చేస్తామని నమ్మించారు. 

ఇందుకు ఫోన్ కు ఒక లింక్​ పంపిస్తామని, అది క్లిక్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేయాలని సూచించగా.. రాజిరెడ్డి అలాగే చేయడంతో అకౌంట్ లోంచి రూ. 46వేలు కట్ అయ్యాయి. దీంతో మోసపోయిన రాజిరెడ్డి ముస్తాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్పీ ఆదేశాల మేరకు సిరిసిల్ల సైబర్ టీమ్ పోలీసులు టెక్నాలజీ ఆధారం గా నిందితుడు సలీంమాలిక్ ను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా రాష్ట్రవ్యాప్తంగా రూ.60లక్షల ఆన్ లైన్ మోసాలు చేశారని తేలింది.  మరో నిందితుడు సతీశ్​  పరారీలో ఉన్నాడని డీఎస్పీ తెలిపారు.