
- బండి సంజయ్‌పై అభ్యంతరకర పోస్టింగ్స్ చేశారని
- బీజేపీ లీగల్ సెల్ ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు మానస బీఆర్‌ఎస్, బానోత్ రేవంత్, సత్యపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు బుధవారం కేసు నమోదు చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై ఎక్స్ వేదికగా తప్పుడు ప్రచారం చేస్తూ ఆయన ప్రతిష్టకు భంగం కల్గిస్తున్నారన్న ఆరోపణలతో వారిపై కేసు ఫైల్ అయింది. బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ గోకుల్ రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీజీసీఎస్‌బీ డీఎస్పీ కేవీఎం ప్రసాద్ బుధవారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు.
ఓ బీఆర్‌ఎస్ నేత బీదర్‌లో దొంగనోట్లు నడిపించాడని ఇటీవల మీడియా సమావేశంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా కొందరు బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు ఆయనపై ఎక్స్ వేదికగా పోస్టింగ్స్ చేస్తున్నారు. దీనిపై గోకుల్ రామారావు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.