గణేశ్ ఉత్సవాలపై  సైబరాబాద్ సీపీ సమీక్ష

గణేశ్ ఉత్సవాలపై  సైబరాబాద్ సీపీ సమీక్ష

హైదరాబాద్: ఈ నెల 31 నుంచి గణేశ్ ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బందోబస్తు, గణేశ్ నిమజ్జనంపై తీసుకోవాల్సిన చర్యల గురించి వారితో చర్చించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ... గణేశ్ ఉత్సవాల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి గణేశ్ మండపం దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులను కోరారు. అలాగే మండపాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు తప్పకుండా చేసుకోవాలన్నారు. మరోవైపు వినాయక చవితి నేపథ్యంలో నగరంలో విగ్రహాల అమ్మకాలు జోరందుకున్నాయి.

ఇకపోతే... వినాయక చవితి అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు భాగ్యనగరం వైపే చూస్తుంటారు. హైదరాబాద్‌లో జరిగే వేడుకల్ని చూసేందుకు భారీ ఎత్తున జనం నగరానికి చేరుకుంటారు. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేశ్ విగ్రహాన్ని చూడడానికి జనం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక నిమజ్జనానికి అదే స్థాయిలో ప్రజలు వస్తుంటారు. ఈ నేపథ్యంలో భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు హైదరాబాద్ అధికారులు. మరికొన్ని రోజుల్లో వినాయక చవితి పండగ ప్రారంభం కానుండటంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు.