14 సైబర్ క్రైం కేసుల్లో 23 మంది అరెస్టు

14  సైబర్ క్రైం  కేసుల్లో 23 మంది అరెస్టు

సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు జనవరి16  నుంచి 22 వరకు 14 సైబర్ క్రైమ్ కేసుల్లో దేశవ్యాప్తంగా 23 మందిని అరెస్ట్ ​చేశారు. ఇందులో 11 మంది ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసాలకు పాల్పడ్డవారే ఉన్నారని సైబర్ ​క్రైం డీసీపీ వైవీఎస్ ​సుధీంద్ర తెలిపారు. ప్రధాన కేసులో రూ.2.90 కోట్ల ట్రేడ్ ​ఫ్రాడింగ్ ​కేసు ఉందని చెప్పారు. ఈ కేసులో బాధితుడిని నిందితులు వాట్సాప్ గ్రూపుల ద్వారా సంప్రదించి లాభాలు వస్తాయని చెప్పారు. ‘ఆల్ఫా అలయన్స్ ఇన్వెస్ట్​మెంట్ క్లబ్’ అనే నకిలీ పెట్టుబడి ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు పెట్టించారు.

నకిలీ అప్లికేషన్‌లో వర్చువల్ లాభాలు, ఐపీఓ కేటాయింపులు చూపి, బాధితుడి నుంచి రూ.2,90 కోట్లకు పైగా ట్రాన్స్​ఫర్​చేయించుకున్నారు. ఈ  కేసులో శివకాంత్ రాజు దాట్ల,  సూర్య భగవాన్ మోరపాకను అరెస్ట్​ చేశారు. 74 ఏళ్ల వృద్ధ మహిళ వద్ద డిజటల్ ​అరెస్ట్​పేరిట రూ.56.50 లక్షలు కొట్టేశారన్నారు. వృద్ధురాలికి తాము ముంబై పోలీసులమని, ఆర్​బీఐ నుంచి ఆఫీసర్లను మాట్లాడుతున్నామని చెప్పారు. ఆధార్‌ను దుర్వినియోగం చేసి మనీ లాండరింగ్ చేసిందని, మానవ అక్రమ రవాణా కేసుల్లో  ఇరుక్కున్నారని   భయపెట్టారన్నారు. ఈ కేసులో  కేసన మాణిక్యరావు, - కేసన లక్ష్మీ నందినిని అరెస్ట్​ చేసినట్టు చెప్పారు. అలాగే..  ఇటీవల 70 కేసుల్లో 354 రిఫండ్ ఆర్డర్లు సాధించి, బాధితులకు రూ. కోటికి పైగా ఇప్పించినట్లు చెప్పారు.