పొటాటో కట్టర్​ ఎంత పన్జేసింది?

పొటాటో కట్టర్​ ఎంత పన్జేసింది?
  • ఆన్​లైన్​లో ఐటెం కొన్నందుకు కారు గిఫ్ట్​ వచ్చిదంటూ మెసేజ్​​
  • 2.3 లక్షలు డిపాజిట్ ​చేయించుకుని చీటింగ్​
  • ఇలా దేశవ్యాప్తంగా రూ.5 కోట్లు కొట్టేసిన గ్యాంగ్​
  • బిహార్​ ముఠాను అరెస్ట్​ చేసిన సైబరాబాద్​ పోలీసులు

హైదరాబాద్, వెలుగు:

ఇంట్లో ఆలుగడ్డలు కట్​చేసేందుకు పొటాటో  కట్టర్​ అవసరమైంది ఓ మహిళకు. ఓ ఈ కామర్స్​వెబ్​సైట్​లో రూ.228కు దొరకడంతో ఆర్డర్​ చేసింది. రెండు రోజులకే ఓ ఫోన్​ వచ్చింది. ‘కంగ్రాచ్యులేషన్స్​ మేడమ్. మీరు పొటాటో కట్టర్​ కొన్నారు కదా..లక్కీ డ్రాలో మీకు 6.9 లక్షల విలువ చేసే కారు వచ్చింది’ అని చెప్పారు. కొన్ని డబ్బులు డిపాజిట్​ చేయాలనడంతో పలు దఫాలుగా రూ.2.3 లక్షలు బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేసింది. చివరికి మోసపోయానని తెలిసి గొల్లుమంది. పోలీసులకు కంప్లయింట్​ ఇవ్వడంతో సైబరాబాద్​ సైబర్​ క్రైం పోలీసులు నిఘా పెట్టి ఆరుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాలో నలుగురిని శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి12 మొబైల్ ఫోన్లతో పాటు 2 లాప్ టాప్స్, 2 స్కానర్లు, ప్రింటర్, స్నాప్ డీల్ కంపెనీ పేరుతో ఉన్న 5 ఫేక్ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను సైబర్ క్రైమ్స్ అదనపు డీసీపీ కవిత, ఏసీపీ శ్రీనివాస్ తో కలిసి సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు.

గ్యాంగ్ లీడర్ చదివింది ఇంటరే..

బీహార్ షైక్ పురా జిల్లా కబీర్​పూర్​కు  చెందిన సందీప్ కుమార్ అలియాస్ ఆర్యన్ (22) ఇంటర్ చదివాడు. స్మార్ట్ ఫోన్స్,ఈ–కామర్స్ సైట్లపై అవగాహన ఉండడంతో  చీటింగ్‌కు ప్లాన్​ వేశాడు. ఫ్లిప్ కార్ట్, అమెజాన్‌తో స్నాప్ డీల్, షాప్ క్లూస్, క్లబ్ ఫ్యాక్టరీ, నాప్ టాల్​ లాంటి టెలిషాపింగ్ కస్టమర్ల డేటా బేస్ తో స్కెచ్ వేశాడు. న్యూఢిల్లీ ఘజియాబాద్‌కు చెందిన తాసిఫ్ అహ్మద్(30) లక్ష్మీనగర్‌కు చెందిన వికాస్ కుమార్(30) తో డీల్ కుదుర్చుకున్నాడు. తాసిఫ్​7 టోల్ ఫ్రీ నంబర్స్ క్రియేట్​ చేయడంతో పాటు వికాస్ తో కలిసి ఈ–కామర్స్ నకిలీ సైట్స్ తయారు చేశాడు. వీటిని గూగుల్ యాడ్స్ తో కనెక్ట్ చేశాడు. ఇలా బిగ్ రాక్, గో డాడీ లాంటి ఈ–కామర్స్ సైట్స్ ను కూడా వదల్లేదు. బల్క్ ఎస్ఎంఎస్ సర్వీస్ కూడా డెవలప్ చేసి సందీప్ కు ఇచ్చాడు. సందీప్​తన బంధువైన బీహార్ లోని డక్రాకు చెందిన బిపిన్ కుమార్ తో ఈ–కామర్స్ సైట్స్, టెలీ మార్కెటింగ్ కంపెనీల కస్టమర్ల డేటాబేస్ ఆధారంగా ఫోన్ నంబర్స్, బ్యాంక్ ఎకౌంట్స్ డిటెయిల్స్ ​కలెక్ట్​ చేసేవాడు. ఇలా  వచ్చిన నెంబర్ల ఆధారంగా ఆన్ లైన్ షాపింగ్‌లో గిఫ్ట్ లు, ప్రైజ్​లు వచ్చాయంటూ బల్క్ మెసేజ్ లు పంపేవారు. రిప్లై ఇచ్చేవాళ్లను చీట్​ చేసేవారు. ఇలా దేశ వ్యాప్తంగా సుమారు లక్షకు పైగా నంబర్లను ఈ ముఠా సేకరించింది. తన సొంతూరు కబీర్ పురాకు చెందిన సందీప్ పస్వాన్, మిర్బిహాకు చెందిన మానిక్ చంద్ పస్వాన్(30) ను టెలీకాలర్స్ గా ఉపయోగించాడు. మొత్తం మూడు ఎకౌంట్లను క్రియేట్​ చేసి అందులోకి మనీ ట్రాన్స్​ఫర్​ చేయించుకునేవాడు. ఇదంతా బీహార్ నవడా జిల్లా బిండిచక్ లోని బిపిన్ కుమార్ ఇంటి నుంచి నడిపించేవారు. ఇలా రూ.5 కోట్ల వరకూ కొట్టేశారు. ఇప్పటివరకు గిఫ్ట్​లు వచ్చాయంటూ చేసిన మోసాలే వెలుగు చూశాయని, ఫేక్​ ఈ కామర్స్​వెబ్​సైట్స్​ ద్వారా చేసిన చీటింగ్స్​పై విచారణ చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

ఇలా చీట్​ చేశారు

సైబరాబాద్ కి చెందిన సంధ్యారాణి ఆగస్ట్ 8న స్మార్ట్ ఫోన్ నుంచి స్నాప్​డీల్​యాప్​లో పొటాటో కట్టర్​ కొన్నారు. సెప్టెంబర్ 11న ఆమెకు ‘‘QP–-SNDEAL” పేరుతో మెసేజ్ వచ్చింది. అందులో ‘ఫస్ట్ ప్రైజ్ కింద రూ.6.90‌‌‌‌లక్షల టాటా నెక్సాన్ కారు వచ్చింది. కంపెనీ రూల్స్ ప్రకారం మా ఎస్​బీఐ అకౌంట్ లో రూ.6,500  రిజిస్ట్రేషన్ ఛార్జీలు వేయాలి. మరిన్ని వివరాల కోసం 18003133226 టోల్ ఫ్రీ నంబర్ తో పాటు 06289633543 వాట్సాప్​ నంబర్ లో సంప్రదించండి” అన్నది సారాంశం. దీంతో సంధ్యారాణి టోల్ ఫ్రీ నంబర్​కు కాల్ చేసింది. రిసీవ్​ చేసుకున్న వ్యక్తి అనుమానం రాకుండా ప్రైజ్ క్లైమ్ చేసుకోవడం కోసం సంధ్యారాణి ఫొటో, ఆధార్, పాన్ కార్డులను తీసుకున్నాడు. కారు రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు ఇతర ఖర్చులు చెల్లిస్తే రెండు రోజుల్లోనే వస్తుందని నమ్మించాడు. కారు వద్దనుకుంటే రూ.6.9 లక్షలు కేవలం15 నిమిషాల్లోనే ట్రాన్స్ ఫర్ చేస్తామని చెప్పాడు. కానీ తనకు కారే కావాలని పట్టుబట్టడంతో గూగుల్​ పే, ఫోన్​ పే, పేటీఎం లేదా బ్యాంక్​ ఎకౌంట్​కు ట్రాన్స్​ఫర్​ చేయొచ్చని చెప్పాడు. రిజిస్ట్రేషన్ ఫీజు, ఆర్టీఓ ఛార్జెస్, ఇన్స్యూరెన్స్ ఛార్జెస్, కార్ చెకింగ్, జీఎస్టీ, ట్రాన్స్ పోర్టేషన్ ఛార్జెస్, డ్రైవర్ ఛార్జ్ అంటూ రూ.2.3 లక్షలు డిపాజిట్ చేయించుకున్నారు.  తర్వాత ఎన్నిసార్లు కాల్​ చేసినా స్పందించలేదు. దీంతో తాను మోసపోయానని గుర్తించి నవంబర్ 13న సంధ్యారాణి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Cyberabad police have arrested the Bihar gang for committing online crimes