- వర్షం పడితే ఎట్ల ముందుకెళ్దాం
- పలు సమస్యలపై విస్తృత చర్చ
గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్‌లో ప్రధాన సమస్య ట్రాఫిక్ జామ్. వర్షం పడితే రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వీటితోపాటు పలు సమస్యల పరిష్కారంపై ఏం చేయాలనే దానిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి - చార్మినార్ జోన్ల మధ్య గురువారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సంయుక్త సమన్వయ సమావేశం జరిగింది.
ఇందులో సైబరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) డా. గజరావు భూపాల్, జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి జోన్ కమిషనర్ హేమంత్ భోర్ఖడే, జాయింట్ కమిషనర్ వి. ప్రశాంతి పాల్గొన్నారు. ఐటీ కారిడార్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలు, పాదచారుల భద్రత, నీటిముంపు సమస్యలు, రోడ్ల అభివృద్ధి, సిగ్నల్ వ్యవస్థల మెరుగుదలపై విస్తృతంగా చర్చించారు.
ప్రధాన జంక్షన్ల వద్ద అండర్‌పాసులు, ఫ్లైఓవర్లు, స్కైవాక్‌లు, ఫుట్‌పాత్‌లు నిర్మించడం, డ్రైనేజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, అలాగే పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించారు. పాదచారులు, ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం ప్రత్యేక సర్వీస్ రోడ్లు, రక్షిత క్రాసింగ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.
రాబోయే కేఎన్ఆర్ ప్రాజెక్టుల కారణంగా ఐఐఐటీ జంక్షన్ వద్ద ట్రాఫిక్‌పై పడే ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని నిర్ణయించారు. మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్, మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్‌కుమార్, ఏసీపీలు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.
