25 మంది సైబర్ మోసగాళ్లు అరెస్ట్

25 మంది సైబర్ మోసగాళ్లు అరెస్ట్

బషీర్​బాగ్, వెలుగు: జూన్ నెలలో సైబర్ మోసాలకు పాల్పడిన 25 మందిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో నమోదైన 66 కేసుల్లో ప్రమేయం ఉన్న ఏపీ, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా , కర్నాటక , మహారాష్ట్రకు చెందిన నిందితులను అరెస్ట్ చేసి, 64 కేసుల్లో బాధితులకు న్యాయం చేసినట్లు డీసీపీ వెల్లడించారు. 

నిందితులకు దేశవ్యాప్తంగా 453 సైబర్ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరి నుంచి 34 మొబైల్ ఫోన్లు, 20 చెక్ బుక్కులు, 17 డెబిట్ కార్డులు , 8 సిమ్ కార్టులు, 16 బ్యాంక్ పాస్ బుక్కులు, రూ.లక్ష నగదు సీజ్ చేశారు. ముఖ్యంగా నగరానికి చెందిన ఓ వ్యాపారవేత్తను ఫేక్ ట్రేడింగ్ ప్లాట్ ఫామ్​పై పెట్టుబడి పెట్టించి రూ.2.59 కోట్ల కొట్టేసిన కేసులో.. హర్యానాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. అలాగే టోలిచౌకికి చెందిన 65 ఏండ్ల వ్యక్తిని ఇన్వెస్ట్మెంట్ పేరిట రూ.74 లక్షలు మోసగించిన కేసులో పూణెకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. 

జూన్ 14న జరిగిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా రూ.72.85 లక్షలతోపాటు అదనంగా మరో రూ.3.67 కోట్లను సీజ్ చేశారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సైబర్ మోసానికి గురైతే 1930 నంబర్ కు లేదా  https://cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలని డీసీపీ సూచించారు.