స్టేట్ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉందా..? అయితే మారిన ఈ రూల్ గురించి తెలుసుకున్నారా..?

స్టేట్ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉందా..? అయితే మారిన ఈ రూల్ గురించి తెలుసుకున్నారా..?

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులో కోట్ల మంది ప్రజలకు సేవింగ్స్ అకౌంట్స్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కంపెనీ తన ఖాతాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని మార్పులను ప్రకటించింది. 

వివరాల్లోకి వెళితే స్టేట్ బ్యాంక్ తాజాగా ఆటో స్వీప్ డిపాజిట్స్ పరిమితులను సెప్టెంబర్ 1, 2025 నుంచి మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. మార్చిన రూల్స్ ప్రకారం ఎవరైనా అకౌంట్ హోల్డర్ మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ కింద నమోదు చేసుకున్నట్లతే వారి ఖాతాలో డబ్బు రూ.50వేల పరిమితిని దాటితే ఆ మెుత్తాన్ని టర్మ్ డిపాజిట్ రూపంలో మార్చేస్తుంది బ్యాంక్. గతంలో ఈ పరిమితి సేవింగ్స్ ఖాతాలకు రూ.35వేలుగా ఉండేది. ఇలా చేయటం వల్ల ప్రతిసారి ఖాతాదారుల నుంచి బ్యాంక్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే అదనపు నిధులను ఎఫ్ డి చేసేందుకు అవకాశం లభిస్తుంది. 

పైగా ఈ ఆటో స్వీప్ ఫెసిలిటీ ఖాతాదారుల అకౌంట్లో ఉన్న అదనపు నిధులకు వడ్డీ ఆదాయం వచ్చేలా చేస్తుంది. అసలు ఈ ఆటో స్వీప్ డిపాజిట్స్ ఫెసిలిటీ ఎలా పనిచేస్తోందో గమనిస్తే.. ఖాతాదారుల అనుమతి పొందిన తర్వాత ఎప్పుడైనా రూ.50వేల కంటే ఎక్కువ డబ్బు వారి అకౌంట్లో ఉన్నట్లయితే ఆటోమెటిక్ గా అది ఫిక్స్డ్ డిపాజిట్ చేయబడుతుంది. అలాగే ఖాతాలో డబ్బు రూ.50వేల కంటే తక్కువకు చేరినప్పుడు చెల్లింపులకు ఇబ్బంది లేకుండా డిపాజిట్ రివర్స్ చేయబడుతుంది. చెల్లింపుకు అనుగుణంగా డిపాజిట్ మెుత్తం లేదా కొంత భాగం నగదుగా తిరిగి ఖాతాలోకి జమ చేయబడుతుంటుంది. 

ప్రజలు ఇండివిడ్యువల్, జాయింట్ లేదా మైనర్ల పేరుపై నిర్వహించే అకౌంట్లకు కూడా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. దీని కింద డిపాజిట్ చేసే మెుత్తం ఏడాది కాలానికి కనీసం ఎఫ్ డి చేయబడుతుంది. దీనిపై వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. ముందస్తుగా డిపాజిట్ క్యాన్సిల్ చేసుకుంటే స్వల్ప మెుత్తంలో పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. దీనివల్ల అకౌంట్ హోల్డర్లు తమ వద్ద ఉన్న అదనపు సొమ్ముపై అధిక వడ్డీ ప్రయోజనాలను అందుకుంటారని కంపెనీ చెబుతోంది. 

స్టేట్ బ్యాంక్ ఆటో స్వీప్ మార్చిన రూల్స్.. 
* థ్రెషోల్డ్ పరిమితి గతంలో ఉన్న రూ.35 వేల నుంచి రూ.50 వేలకు పెంపు. 
* స్వీప్ తర్వాత కనీస అకౌంట్ బ్యాలెన్స్: రూ.25వేల నుంచి రూ.35 వేలు
* కనీస డిపాజిట్ మొత్తం:  రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంపు. ఒక్కో డిపాజిట్ రూ.5వేల చొప్పున ఉంటుంది.