
వరంగల్, వెలుగు: వరంగల్ రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మక మామునూర్ ఎయిర్పోర్ట్కల త్వరలోనే సాకారం అవుతుందని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. బుధవారం వరంగల్ ఐడీవోసీ గ్రౌండ్‍లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవాల్లో మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకం ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మామునూర్ ఎయిర్పోర్ట్ భూసేకరణ రాష్ట్ర సర్కారు రూ.205 కోట్లు విడుదల చేయగా, ఇప్పటికే నిర్వాసిత రైతులకు రూ.34 కోట్లు పరిహారం చెల్లించామన్నారు.
రూ.4,170 కోట్లతో అండర్‍గ్రౌండ్ డ్రైనేజీ పనులను వీలైనంత త్వరగా ప్రారంభిస్తామన్నారు. రూ.80 కోట్లతో చేపట్టిన నయా కలెక్టరేట్, వరంగల్ కొత్త బస్టాండ్ పనులు వేగవంతం చేశామన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో స్థానిక యువతకు అధిక ప్రాధాన్యాత ఇస్తామన్నారు. భద్రకాళి ఆలయం మాడవీధులు, రాజగోపురాలు నిర్వహించడమే కాకుండా 382 ఎకరాల భద్రకాళి చెరువుపై రోప్ వే, గాజు వంతెనకు ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు.
జీడబ్ల్యూఎంసీలో రూ.350 కోట్లతో 1,867 అభివృద్ధి పనులు చేపట్టగా, 975 పనులు పూర్తయినట్లు తెలిపారు. స్మార్ట్ సిటీ పథకంలో రూ.499 కోట్ల 67 లక్షలతో 66 అభివృద్ధి పనులు మంజూరవగా, రూ.249 కోట్ల 73 లక్షల విలువైన 48 వర్క్స్ పూర్తయ్యాయని చెప్పారు. వన మహోత్సవంలో 2025 కిగానూ జిల్లాలో 26 లక్షల 80 వేల మొక్కలు నాటినట్లు తెలిపారు.
జిల్లాలో 3866 డబుల్ బెడ్‍రూం ఇండ్లు మంజూరవగా, 2213 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యిందన్నారు. కార్యక్రమంలో శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, దొంతి మాధవరెడ్డి, గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‍పాయ్, డీసీపీ అంకిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.