
హైదరాబాద్: రియల్ ఎస్టేట్లో ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో భారీ మోసం బయటపడింది. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ శ్రీకాంత్ను పోలీసులు ఈ కేసులో అరెస్ట్ చేశారు. సరూర్ నగర్, బోడుప్పల్, తట్టి అన్నారంలో ప్రాజెక్ట్స్ ప్రారంభిస్తున్నామని చెప్పి కోట్లలో వసూలు చేసి ఈ కంపెనీ బోర్డు తిప్పేసింది. 40 బాధిత కుటుంబాలు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్కు చేరుకుని మోసపోయామని.. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ తమను మోసం చేసిందని వాపోయారు. మూడు ప్రాజెక్టుల పేరుతో రూ. వందల కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని హేమానగర్లో రెండున్నర ఎకరాల స్థలాన్ని 2020లో కొనుగోలు చేస్తున్నానని క్రితిక ఇన్ఫ్రా డెవలపర్స్ సీఈఓ శ్రీకాంత్ రూ.70 కోట్ల వరకు డబ్బులు వసూలు చేశాడు. కానీ శ్రీకాంత్ 2 ఎకరాల స్థలం మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ స్థలాన్ని 140 మందికి రిజిస్ట్రేషన్ చేయించాడు. కానీ ఇంకా 40 మందికి ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయలేదు.
►ALSO READ | 8 రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సెర్చ్ ఆపరేషన్
డబ్బులు కట్టి ఐదు సంవత్సరాలు అవుతున్నా తమకు ఎలాంటి పొజిషన్ ఇవ్వడం లేదని, అపార్ట్ మెంట్ కట్టి ఇవ్వడం లేదని, తమకు రిజిస్ట్రేషన్ చేసిన స్థలాన్ని మళ్ళీ మిగతా 40 మందికి రిజిస్ట్రేషన్ చేస్తున్నాడని బాధితులు పోలీసుల ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరి దగ్గర రూ.40 లక్షల నుంచి 60 లక్షల వరకు వసూలు చేసి నాలుగు సంవత్సరాలవుతున్నా ఫ్లాట్స్ ఇవ్వడం లేదనేది బాధితుల వాదన.