8 రాష్ట్రాల్లో ఎన్‌‌‌‌ఐఏ సెర్చ్‌‌‌‌ ఆపరేషన్

8 రాష్ట్రాల్లో ఎన్‌‌‌‌ఐఏ సెర్చ్‌‌‌‌ ఆపరేషన్
  • విజయనగరంలో నమోదైన ఐసిస్ కేసులో దర్యాప్తు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఏపీలోని విజయనగరంలో నమోదైన ఐసిస్‌‌‌‌ ఉగ్రవాదుల కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌‌‌‌ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, ఢిల్లీలోని  మొత్తం 16 ప్రాంతాల్లో మంగళవారం సోదాలు నిర్వహించింది. డిజిటల్ డివైజులు, డాక్యుమెంట్లు, నగదు సహా సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌ఫాంల ద్వారా ఉగ్రవాదం వైపు యువత రిక్రూట్‌‌‌‌మెంటుకు సంబంధించిన ఆధారాలు సేకరించింది. 

సోదాల వివరాలను మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. విజయనగరం కేంద్రంగా ఐఈడీల ద్వారా విధ్వంసాలకు పాల్పడడానికి కుట్రపన్నిన కేసులో ఐసిస్‌‌‌‌ ఉగ్రవాది సిరాజ్-ఉర్ -రెహమాన్‌‌‌‌ను జులైలో అరెస్ట్‌‌‌‌ చేసిన సంగతి తెలిసిందే.  విజయనగరం పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా ఎన్‌‌‌‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఉగ్రవాద నెట్‌‌‌‌వర్క్‌‌‌‌పై  స్పెషల్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. 

ఐఈడీల తయారీకి ఉపయోగించే రసాయన పదార్థాలను సేకరిస్తున్న సిరాజ్ మరో నిందితుడు సయ్యద్ సమీర్ ఇచ్చిన సమాచారంతో ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్‌‌‌‌ అనే అనుమానితుని వివరాలు సేకరించింది. సిరాజ్‌‌‌‌తో కలిసి నేపాల్ సరిహద్దు ద్వారా ఆయుధాల సరఫరాకు ఏర్పాట్లు చేయడానికి కుట్ర చేసినట్లు గుర్తించింది. ఇందులో భాగంగా ఆగస్టు 27న రియాద్‌‌‌‌కు పారిపోవడానికి ప్రయత్నించిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌ చేసింది. దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎన్‌‌‌‌ఐఏ అధికారులు తెలిపారు.