
పినపాక, వెలుగు : గత పదేండ్ల పాలనలో దోపిడీకి పాల్పడివారికి రానున్న స్థానిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రజలకు సూచించారు. బుధవారం మండలంలోని ఎల్చిరెడ్డిపల్లి, ఏడూళ్ల బయ్యారం గ్రామాల్లో ఆయన పర్యటించారు. క్రాస్‌రోడ్ నుంచి భారీ బైక్రాలీతో ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు కాంగ్రెస్‌లో చేరుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి సహకారంతో పినపాక నియోజకవర్గానికి ఆరు వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు వెల్లడించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నాయకులు డ్రామాకు తెర లేపారని మండిపడ్డారు. యూరియా కొరతపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా కాంగ్రెస్‌ను బద్నాం చేస్తున్నారని విమర్శించారు. అనంతరం వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన పలువురికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం, నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి, వి.లక్ష్మిరెడ్డి, పేరం వెంకటేశ్వరరావు, జి.శ్రీనివాస్ రెడ్డి, దాట్ల రాజేశ్, తోలెం కళ్యాణి, గీద సాయి, బండారు సాంబ తదితరులు పాల్గొన్నారు.