సాయుధ పోరాట స్ఫూర్తితోనే నియంత పాలన నుంచి విముక్తి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

సాయుధ పోరాట స్ఫూర్తితోనే నియంత పాలన నుంచి విముక్తి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హనుమకొండ, వెలుగు: తెలంగాణకు నియంత పాలన నుంచి విముక్తి కల్పిస్తామని ప్రజలకు మాటిచ్చామని, సాయుధ పోరాట స్ఫూర్తితోనే 2023 డిసెంబర్ 3న రాష్ట్రానికి స్వేచ్ఛను ప్రసాదించామని రెవెన్యూ శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా బుధవారం హనుమకొండ ఐడీవోసీలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. 

అంతకుముందు అదాలత్ లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఆ తర్వాత కలెక్టరేట్ లో జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి ప్రసంగిస్తూ ఓరుగల్లు అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందని మంత్రి పొంగులేటి అన్నారు. ఎన్నడూ లేనివిధంగా హనుమకొండ, వరంగల్ నగరాలను రూ.5 వేల కోట్లతో డెవలప్ చేస్తున్నామన్నారు.

 2057 జనాభాను దృష్టిలో పెట్టుకుని రూ.4,100 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను త్వరలోనే ప్రారంభించబోతున్నామన్నారు. ఇప్పటికే ఓరుగల్లు మాస్టర్ ప్లాన్ ను అమలులోకి తెచ్చామన్నారు. చారిత్రక భద్రకాళి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే మాడవీధుల పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. హనుమకొండ కలెక్టరేట్ బంగ్లాను ఆధునికీకరించామన్నారు. భీమదేవరపల్లి మండలం వంగరలో రూ.7 కోట్లతో చేపట్టిన పీవీ విజ్ఞాన వేదిక వర్క్స్ పూర్తికావచ్చాయన్నారు. పరకాలలో రూ.35 కోట్లతో ఆస్పత్రి, హనుమకొండ జేఎన్ఎస్ లో తాత్కాలికంగా స్పోర్ట్స్ స్కూల్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు. 

సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మంత్రులు, ఎమ్మెల్యేలంతా కలిసి ప్రజల బాగోగుల గురించి పని చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ వెస్ట్, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్, వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.