మిచౌంగ్ తుఫాన్ బీభత్సం.. ప్రజలను హెచ్చరించిన భారత క్రికెటర్లు

మిచౌంగ్ తుఫాన్ బీభత్సం.. ప్రజలను హెచ్చరించిన భారత క్రికెటర్లు

మిచౌంగ్ తుఫాన్‌(Cyclone Michaung) ధాటికి తమిళనాడు రాజధాని చెన్నై నగరం అతలాకుతలమైంది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయం నీటమునగాయి. దీంతో పలు విమనాలు రద్దు కాగా, మరొకొన్నింటిని దారి మళ్లించారు. ఈ తరుణంలో చెన్నై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత క్రికెటర్లు సూచించారు. 

నా చెన్నై స్నేహితుల్లారా.. సురక్షితంగా ఉండండి. అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి. ఇలాంటి విపత్కర సమయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.. అని భారత వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్ సూచించగా,  కష్టకాలంలో ప్రజలకు అండగా ఉంటూ పరిస్థితులు చక్కదిద్దుతున్న అధికారులకు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ధన్యవాదాలుతెలిపారు. భారత మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ మరికొందరు భారత క్రికెటర్లు కూడా నగరంలో చిక్కుకున్న వారి క్షేమం కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

చెన్నై నగరమా సురక్షితంగా ఉండు..!

మరోవైపు శ్రీలంక యువ బౌలర్, చెన్నై సూపర్ కింగ్స్ పేసర్..  నా చెన్నై నగరమా సురక్షితంగా ఉండు అని ట్వీట్ చేశాడు. కాగా శ్రీలంకకు చెందిన మతీశ పతిరణ.. ఐపీఎల్ లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌-2023 సీజన్‌లో 12 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టి.. చెన్నై ఐదోసారి చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. వచ్చే ఎడిషన్‌కు గానూ.. పతిరణను సీఎస్‌కే రిటైన్‌ చేసుకుంది.