మయన్మార్‌‌‌‌లో మోకా తుఫానుకు 145 మందికి పైగా మృతి

మయన్మార్‌‌‌‌లో మోకా తుఫానుకు 145 మందికి పైగా మృతి
  •     రఖీనె రాష్ట్రంలోనే ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువ
  •     గత పదేండ్లలో ఎన్నడూ లేనంతగా నష్టం

బ్యాంకాక్: మయన్మార్‌‌‌‌లో భీకర తుఫాను ‘మోకా’ దెబ్బకు 145 మందికి పైగా చనిపోయారు. తుఫాను వల్ల ఎక్కువ నష్టం సంభవించిన రఖీనె రాష్ట్రంలోనే వీరంతా చనిపోయారని దేశ అధికారిక టెలివిజన్ ‘ఎంఆర్‌‌‌‌టీవీ’ వెల్లడించింది. ‘‘చనిపోయిన వారిలో నలుగురు సైనికులు, 24 మంది రఖీనె వాసులు, 117 మంది రోహింగ్యాలు ఉన్నారు. తుఫాను హెచ్చరికలు జారీ చేసినా.. ఇండ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లకపోవడంతోనే ప్రాణ నష్టం ఎక్కువగా సంభవించింది” అని తెలిపింది. కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతినడంతో నష్టం, మరణాలకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా అందుతున్నాయి. ‘‘400 మందికి పైగా చనిపోయినట్లు వస్తున్న వార్తలు అబద్ధం. ప్రాణ, ఆస్తి నష్టం గురించిన స్పష్టమైన వివరాలు అందుబాటులో లేవు” అని మిలిటరీ ప్రభుత్వం తెలిపింది.

ఆదివారం నుంచి..

మోకా తుఫాను ప్రభావం గత ఆదివారం మధ్యాహ్నం రఖీనెలోని సిట్వీ టౌన్‌‌షిప్‌‌లో మొదలైంది. గంటకు 209 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. జోరువానతో వరదలు పోటెత్తాయి. కరెంటు సరఫరా నిలిచిపోయింది. సెల్‌‌ఫోన్‌‌ టవర్లు కూలిపోయాయి. ఇండ్ల రూఫ్‌‌టాప్‌‌లో ఎగిరిపోయాయి. గత పదేండ్లలో ఎన్నడూ లేనంతగా నష్టాన్ని మిగిల్చింది. కోస్టల్ రఖీనెపై ఎక్కువగా తుఫాను ఎఫెక్ట్ పడిందని వివరించింది.

4 షిప్పుల్లో సాయం పంపిన ఇండియా

ఇండియా, జపాన్, ఇంగ్లండ్, అమెరికా తదితర దేశాలు మయన్మార్‌‌‌‌కు సాయం చేశాయి. సరుకులను సరఫరా చేశా యి. భారత్​ నుంచి యాంగోన్‌‌కు రిలీఫ్‌‌ మెటీరియల్‌‌తో 3 నేవీ షిప్‌‌లు వెళ్లాయి. నాలుగో షిప్‌‌ శుక్రవారం చేరుకుంది. వీటిలో ఆహారం, టెంట్లు, మందులు, బట్టలు ఉన్నట్లు జైశంకర్ ట్వీట్ చేశారు.