చేతికొచ్చిన పంట నీళ్లపాలు

చేతికొచ్చిన పంట నీళ్లపాలు
  • రాష్ట్రవ్యాప్తంగా 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం
  • 2.82 లక్షల ఎకరాల్లో వరి.. 1.51లక్షల ఎకరాల్లో పత్తి డ్యామేజీ
  • ప్రధానంగా 12 జిల్లాల్లోని 179 మండలాల్లో తుఫాన్ ప్రభావం
  • ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అపార నష్టం
  • నీట మునిగిన 2.53 లక్షల మంది రైతుల పంటలు 
  • వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా.. ప్రభుత్వానికి నివేదిక  

హైదరాబాద్‌‌, వెలుగు: మొంథా తుఫాన్ దెబ్బకు వానాకాలం పంటలన్నీ ఆగమయ్యాయి. మంగళ, బుధ వారాల్లో కురిసిన భారీ వర్షాలకు కోత దశలో ఉన్న వరి పొలాలు, ఏరే దశలో ఉన్న  పత్తి చేలు నేలవాలాయి. మక్కలు, పల్లీ, కూరగాయల పంటలు సైతం దెబ్బతిన్నాయి. కోతలు పూర్తయి కల్లాల్లో, సెంటర్లలో పోసిన వడ్ల కుప్పలు వరద నీటిలో తేలియాడాయి. పలుచోట్ల వడ్లు కొట్టుకుపోయాయి. అటు పత్తి  రైతుల ఆశలూ ఆవిరయ్యాయి. ఏరడానికి సిద్ధంగా ఉన్న పత్తి.. చెట్ల మీదే తడిసి నేలరాలింది. 

అసలే తేమశాతం పేరుతో సీసీఐ కొర్రీలు పెడ్తుండడంతో తడిసి, నల్లబడిన పత్తిని ఏం చేయాలో తెలియని దుస్థితిలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం పండించిన పంటలన్నీ నీళ్లపాలు కావడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. తుఫాన్​తమ నోటికాడి బుక్కను ఎత్తగొట్టిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండ్రోజుల పాటు కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 4.47 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందించారు. 

ప్రధానంగా వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, హనుమకొండ, నాగర్‌‌‌‌కర్నూల్, మహబూబాబాద్, జనగామ, కరీంనగర్, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌‌నగర్​ జిల్లాల్లోని 179 మండలాల్లో 2,53,033 మంది రైతులకు చెందిన పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.  త్వరలోనే సర్వే చేసి పూర్తి స్థాయి పంట నష్టాన్ని తేల్చాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. 

ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యధిక నష్టం..

ఈసారి వానాకాలంలో 1.33 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. 67.30 లక్షల ఎకరాల్లో వరి, 45.94 లక్షల ఎకరాల్లో పత్తి, 4.91 లక్షల ఎకరాల్లో మక్క సాగు చేయగా.. ఈ పంటలన్నీ చివరి దశలో ఉన్నాయి. మొంథా తుఫాన్​ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, వరదలకు పంటలన్నీ నీట మునిగాయి. ప్రధానంగా ఉమ్మడి వరంగల్​జిల్లాల్లోనే అత్యధికంగా 1,30,200 ఎకరాల్లో పంట నష్టం  జరిగింది. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో 62,400 ఎకరాల్లో, నల్గొండ జిల్లాలో 52,071 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు  వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదికలో తేలింది. 

2.82 లక్షల ఎకరాల్లో వరి..  

ఈ వానాకాలంలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 67.30 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. తుఫాన్ ​ప్రభావంతో కురిసిన వర్షాలతో వరి పొలాలన్నీ నేలవాలాయి. ముందస్తు నాట్లు వేసిన జిల్లాల్లో పంట చేతికి రాగా కల్లాల్లో, కొనుగోలు సెంటర్లలో ధాన్యం తడిసి ముద్దయింది. చివరి దశలో ఉన్న వరంగల్​, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, జనగామ, మహబూబాబాద్, కరీంనగర్​తదితర జిల్లాల్లో వరి పొలాలు నేలవాలాయి. 

వరంగల్​జిల్లాలో 70,700 ఎకరాల్లో వరి పొలాలు దెబ్బతినగా.. సూర్యాపేట జిల్లాలో 48,444, ఖమ్మంలో 36,893, హనుమకొండలో 33,348, నల్గొండలో 28,055, జనగామలో 18,320, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 16,617, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 15,987, నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 10,585 ఎకరాల్లో పొలాలు దెబ్బతిన్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,82,379 ఎకరాల్లో వరి పొలాలకు నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ అధికారులు తేల్చారు. 

మిగతా పంటలు ఇలా..

వానాకాలంలో సాగైన మిగతా పంటల్లో ప్రధానంగా మక్క 4,963 ఎకరాలు, మిరప 3,613 ఎకరాలు, వేరుశనగ 2,674 ఎకరాల్లో దెబ్బతిన్నది. ఇక పప్పు దినుసులు 1,228 ఎకరాల్లో, కూరగాయ పంటలు 1,300 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. వరంగల్​ జిల్లాలోనే హార్టికల్చర్​ క్రాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నష్టం జరిగింది.  

1.51లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పత్తి..  

ఈసారి రాష్ట్రంలో 45.94 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. అయితే తుఫాన్​ప్రభావంతో కురిసిన వర్షాలతో పంట తీవ్రంగా దెబ్బతిన్నది.  వరంగల్​జిల్లాలో అత్యధికంగా 55 వేల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లగా.. నల్గొండ జిల్లాలో 23,911 ఎకరాల్లో, ఖమ్మంలో 22,574, నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 18,647, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8,752,  కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7,562, జనగామలో 6,445 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 1,51,707 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.