ఖమ్మం జిల్లాలో మొంథా ఎఫెక్ట్.. అంతా ఆగమాగం

ఖమ్మం జిల్లాలో మొంథా ఎఫెక్ట్..  అంతా ఆగమాగం
  • పొంగిపొర్లుతున్న వాగులు, అలుగుపోస్తున్న చెరువులు
  • అలర్ట్​గా ఉండాలని కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఫోన్​ 

ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, నెట్​వర్క్, వెలుగు :  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొంథా తుఫాన్​ ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. పంటలన్నీ నీట మునిగి, కాలనీలు జలమయమై జిల్లా అంతా ఆగమాగం ఉంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. బుధవారం విద్యాసంస్థలకు ఖమ్మం కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టి సెలవు ప్రకటించారు. ఖమ్మం కాల్వొడ్డు బ్రిడ్జి దగ్గర మున్నేరు వరద ప్రవాహాన్ని కలెక్టర్ పరిశీలించారు. 

వరంగల్, జనగామ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా సాయంత్రానికి 18 అడుగులకు మించి మున్నేరు ప్రవహిస్తుండడంతో అక్కడి లోతట్టు కాలనీ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు ఖమ్మం కలెక్టరేట్ తో పాటు, పోలీస్​ కమిషనరేట్ లో కంట్రోల్ రూమ్​ ను ఏర్పాటు చేశారు. వరదలు, భారీ వర్షాలకు సంబంధించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1077, సెల్ ఫోన్ నెంబర్ 9063211298కు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రకటించారు. అత్యవసర సమయాల్లో డయల్‌100కు, స్ధానిక పోలీసులకు, పోలీస్ కంట్రోల్ సెల్ నెంబర్  8712659111కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. 

వాహనాల రాకపోకలకు అంతరాయం..

పలు మండలాల్లో వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొణిజర్ల మండలం అంజనాపురం సమీపంలో నిమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా, లోలెవల్ వంతెనను దాటే ప్రయత్నంలో లారీ కొట్టుకుపోయింది. మహబూబాబాద్ జిల్లా నుంచి ఖమ్మం వచ్చే ముల్కలపల్లి బ్రిడ్జి వద్ద రాకపోకలను పోలీసులు బంద్ చేయించారు. లాలాపురం దగ్గర పగిడేరు వాగులో స్థానికులు చెబుతున్నా వినకుండా రెండు బైకులపై వాగు దాటే యత్నం చేయగా, బైకుపై వెళ్తున్న ఇద్దరిని కాపాడిన రెస్క్యూ బృందాలు కాపాడగా బైకులు కొట్టుకుపోయాయి. లంకాసాగర్​, పాలేరు రిజర్వాయర్​ అలుగు పోస్తున్నాయి. 

ఖమ్మంలో మున్నేరు నది ప్రవాహం 19 అడుగులకు పెరిగింది. పాలేరు రిజర్వాయర్​ను బుధవారం ఐబీ ఎస్ఈ  మంగళపూడి వెంకటేశ్వర్లు పరిశీలించారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 23 అడుగులకు గాను ప్రస్తుత  22.05 అడుగులకు చేరుకుంది. ఇన్ ఫ్లో 2,615 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 2,864 క్యూసెక్కులను అధికారులు వదులుతున్నారు. జిల్లాలో అత్యధికంగా కామేపల్లిలో 93 మిల్లీమీటర్లు, కారేపల్లిలో 91, తిరుమలాయపాలెంలో 89 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మధిర మున్సిపాలిటీ పరిధిలోని ముస్లిం కాలనీ, హనుమాన్​ కాలనీలలో వరదల సమయంలో కాలనీలలోకి నీరు చేరి ఇండ్లను ముంచేస్తోందని, అధికారులు చర్యలు తీసుకోవడంలేదని మధిర, వైరా రోడ్డుపై ముస్లిం కాలనీ వాసులు ధర్నా చేశారు.

 భద్రాద్రికొత్తగూడెంజిల్లాలోని అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, జూలూరుపాడు తో పాటు పలు మండలాల్లో వరి పంట నేల వాలింది. ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు ఏరియాల్లోని ఓపెన్​కాస్టు మైన్స్​లలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. సత్తుపల్లిలోని జేవీఆర్, కిష్టారం  ఓపెన్‌కాస్ట లలో బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. 2 ఓసీల్లో సుమారు 35,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆటంకం ఏర్పడి సుమారు రూ.7 కోట్ల నష్టం జరిగిందని తెలియజేశారు. భద్రాచలం మన్యంలో పలు ఘాట్​ రోడ్లు మూతపడ్డాయి. భద్రాచలం నుంచి రాజమండ్రి వెళ్లే మార్గంలో ఉన్న మారేడుమిల్లి, సీలేరు ఘాటీ రోడ్లలో తుఫాన్​ గాలుల వల్ల కొండచరియలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. మరోవైపు రాజమండ్రి నుంచి జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట మీదుగా భద్రాచలం వచ్చే ఆర్టీసీ సర్వీసులను కూడా ఆంధ్రా సర్కారు నిలిపేసింది.   

కలెక్టర్లతో మాట్లాడిన మంత్రి తుమ్మల 

తుఫాన్​ ప్రభావం నేపథ్యంలో ఖమ్మం కలెక్టర్​ అనుదీప్​, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్ తో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోన్​ లో మాట్లాడి అప్రమత్తం చేశారు. తుఫాన్ వల్ల పత్తి, వరి, ఉద్యాన పంటలకు జరిగిన నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇండ్లలో ఉన్న పత్తిని తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. వరి కోతలు వాయిదా వేసుకోవాలని తెలిపారు. 

సీసీఐ కేంద్రాల్లో, మార్కెట్ యార్డ్ లలో ఉన్న పత్తి తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. వర్షాలు తగ్గాక పూర్తి స్థాయిలో పంట నష్టం వివరాలు అందాక ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని వెల్లడించారు.