ప్రగతిభవన్,సెక్రటేరియెట్ కడితేనే అభివృద్ధా :  మల్లు భట్టి విక్రమార్క

ప్రగతిభవన్,సెక్రటేరియెట్ కడితేనే అభివృద్ధా :  మల్లు భట్టి విక్రమార్క

యాదగిరిగుట్ట, వెలుగు : ‘నీళ్లు లేని ప్రాంతానికి నీళ్లు తెచ్చావా? నాగార్జునసాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ, దేవాదుల, శ్రీపాద ఎల్లంపల్లి  లాంటి ప్రాజెక్టులు కట్టావా? లేక బీహెచ్ఈఎల్, ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్ట్​, ఔటర్ రింగు రోడ్డు వంటి నిర్మాణాలు చేపట్టావా? ఏం సాధించావని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానని ప్రగల్భాలు పలుకుతున్నవ్?’ అని సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు.

‘ప్రగతి భవన్, సెక్రటేరియెట్ కట్టి తెలంగాణ ప్రభ దేశం మొత్తం వెలిగిపోతుందంటే నమ్మడానికి జనం పిచ్చోళ్లు, అమాయకులు కారు కేసీఆర్’ అని  విమర్శించారు. పీపుల్స్ మార్చ్ లో భాగంగా మంగళవారం యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి, మాసాయిపేట, సైదాపురం మీదుగా యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర చేశారు. మాసాయిపేట, సైదాపురంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాసాయిపేట, సైదాపురం, యాదగిరిగుట్టల్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగుల్లో ఆయన ప్రసంగించారు. ఆలేరు నియోజకవర్గానికి దక్కాల్సిన తపాసుపల్లి నీళ్లను మంత్రి హరీశ్​రావు సిద్ధిపేటకు తీసుకుపోతుంటే.. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత చేతులు ముడుచుకుని కూర్చున్నారే తప్ప ఆపే ప్రయత్నం చేయలేదన్నారు. 

కాంగ్రెస్​ను గెలిపిస్తే రూ.500కే సిలిండర్​

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే రూ.500 కే గ్యాస్  సిలిండర్ ఇస్తామని భట్టి హామీ ఇచ్చారు. రైతు రుణాలు ఏకకాలంలో మాఫీ చేస్తామన్నారు. పంట పెట్టుబడి సాయం కింద పట్టాదారులకే కాకుండా కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి రూ.12 వేలు ఇస్తామన్నారు. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఒక ఇంట్లో ఎంతమంది వృద్ధులుంటే అంతమందికి పింఛన్లు ఇస్తామన్నారు.

పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్​చార్జి బీర్ల అయిలయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కుడుదుల నగేశ్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర నాయకుడు కల్లూరి రాంచంద్రారెడ్డి, కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, ఎంపీపీలు చీర శ్రీశైలం, అశోక్, మండల కోఆప్షన్ సభ్యులు ఎండీ యాకూబ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యేమాల ఎలేందర్ రెడ్డి ఉన్నారు.