లక్నోలోని ఆషియానా ప్రాంతంలో ఒక భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం నీట్ పరీక్ష రాయమని తండ్రి ఒత్తిడి చేశాడన్న కోపంతో, 21 ఏళ్ల కొడుకు తన తండ్రిని దారుణంగా హత్య చేశాడు.
పోలీసుల సమాచారం ప్రకారం... లక్నో స్థానిక వ్యాపారవేత్త అయిన మన్వేంద్ర ప్రతాప్ సింగ్ ఫిబ్రవరి 20 నుండి కనిపించకుండా పోయారు. అతని కోసం వెతుకుతున్న సమయంలో వాళ్ళ ఇంటి నుండి విపరీతమైన దుర్వాసన రావడంతో పక్కింటి వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి సోదాలు చేయగా, ఇంట్లోని ఒక డ్రమ్ములో మృతదేహానికి సంబంధించిన కొన్ని భాగాలు దొరికాయి. పోలీసుల విచారణలో కొడుకు అక్షత్ ప్రతాప్ సింగ్ హత్యా నేరాన్ని ఒప్పుకున్నాడు.
అయితే అతని స్టేట్‌మెంట్ ప్రకారం.. ఫిబ్రవరి 20 తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగింది. తనను నీట్ పరీక్ష రాయమని తండ్రి ఒత్తిడి చేయడమే ఈ గొడవకు కారణం అని చెప్పాడు.
గొడవ సమయంలో మాట మాట పెరిగి కోపంతో ఊగిపోయిన అక్షత్, తండ్రికి చెందిన లైసెన్స్ తుపాకీతో ఆయన్ని కాల్చి చంపాడు. మూడో అంతస్తులో హత్య చేసిన తర్వాత, మృతదేహాన్ని కిందకు తీసుకువచ్చాడు. దాన్ని ఎవరికీ తెలియకుండా దాచడానికి ముక్కలుగా నరికాడు. కొన్ని శరీర భాగాలను బయట పడేసి, మరికొన్ని భాగాలను ఇంట్లోనే ఒక డ్రమ్ములో దాచిపెట్టాడు. పోలీసులు అక్షత్ ప్రతాప్ సింగ్‌ను అరెస్ట్ చేయగా... ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలం నుండి ఆధారాలను సేకరించి.. మిగిలిన శరీర భాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
